ఢిల్లీ : తన 37 ఏళ్ల క్రితం నాటి భూవివాదాన్ని పరిష్కరించాలని అస్గర్ అలీ వోహ్రా (81) తన బాల్య మిత్రుడు ప్రధాని మోదీని కోరారు. అందుకు ప్రధాని మోదీ అభయమిచ్చారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌లోని వద్‌నగర్‌లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోహ్రా తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని అభ్యర్థించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
మహారాష్ట్రలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోహ్రా (81) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిశారు. 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’ సంస్థలు తన భూమిని కబ్జా చేశాయని వోహ్రా ఆరోపించారు. అసలు యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి ఆ రెండు సంస్థల పేరిట ఆక్రమించుకున్నారని ఆయన వాపోయారు.
ఈ భూ వివాదానికి సంబంధించి 2015లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరికి ఆయన ప్రధాని మోదీని ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్న వోహ్రాకు ప్రధాని సానుకూలంగా స్పందించి అభయమిచ్చారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ విడుదల చేయగా, ప్రధాని తన బాల్య స్నేహితుడికి తగిన న్యాయం అందేలా చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని కార్యాలయ జోక్యంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’, ‘స్వయం బిల్డర్స్’ ప్రతినిధులకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.


