చేతిలో చెయ్యేసి చిరునవ్వులు చిందిస్తున్న మోదీ, జిన్‌పింగ్, పుతిన్
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్‌స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్‌డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్‌పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు.


