పెళ్లి చేసుకుంటానని నమ్మించి... | Man Blackmail to a young woman | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని నమ్మించి...

Sep 13 2026 3:47 AM | Updated on Sep 13 2026 3:47 AM

Man Blackmail to a young woman

శీతలపానీయంలో మత్తుమందు కలిపి యువతిపై లైంగికదాడి 

వీడియో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌  

ఎవరికైనా చెబితే వీడియో వైరల్‌ చేస్తానని యువకుడి బెదిరింపులు  

సమీప బంధువుకు వీడియో పంపి పైశాచికత్వం

సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.  ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్‌ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వికాష్‌ కుమార్‌ యాదవ్‌ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. 

ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం  తన కోసం  వచ్చిన యువతిని వికాష్‌ కుమార్‌ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు.  

ఎవరికైనా చెబితే  ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో   ఆ యువతి తిరుప్పూర్‌ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్‌ ఉమెన్‌ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్‌కుమార్‌యాదవ్‌ను అరెస్టు చేశారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement