పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేస్తున్న మౌలాబి బంధువులు
అసువులు బాసిన బాలుడి తల్లి
తన తనయుడు మృతికి కారకులను శిక్షించాలంటూ ఆందోళన
ఏ దశలోనూ న్యాయం దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి
పట్టించుకోని ప్రభుత్వం
సింగరాయకొండ: ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి అధికారుల బాధ్యతా రాహిత్యం తోడవడంతో ఒక నిండు ప్రాణం బలైంది. కొడుకు విద్యావంతుడు కావాలన్న ఆశయంతో అతన్ని నవోదయ కోచింగ్‌కు పంపిస్తే అక్కడ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తన కుమారుడి మృతికి స్కూలు యాజమాన్యమే కారణమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లి సయ్యద్ మౌలాబీ ఏడు నెలలుగా చేయని పోరాటంలేదు.. ఎక్కని గడపాలేదు. అయినా ఎక్కడా ఆమెకు న్యాయం దక్కలేదు. దీంతో చేసేదేమీలేక చివరకు ఆత్మహత్యకు యత్నించి ఇప్పుడు విగతజీవిగా మారింది. తన సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలివీ.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న నవోదయ కోచింగ్ తీసుకుంటున్న ఆరో తరగతి విద్యార్థి సయ్యద్ తౌశిక్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. తన కుమారుడి మృతికి స్కూలు యాజమాన్యం వాకా రమణారెడ్డి, వాకా సుజాత, వాకా చైతన్య, మారెడ్డి అనూష, బాబ్జి కారకులని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు అలీ, మౌలాబీ ఒంగోలు కలెక్టరేట్, స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనలు చేశారు.
అయితే, ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యం పాత్రలేదని, తాను చెప్పింది వినకపోతే మీ మీదే కేసులు బనాయించి కోర్టు చుట్టూ తిప్పుతానని ఎస్సై బెదిరించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ అధికారిగా ఉన్న ఎస్సై బీ మహేంద్ర, సీఐ హజరత్తయ్యలను తప్పించి కందుకూరు సీఐ అన్వర్ బాషాకు కేసు అప్పగించారు. ఈ క్రమంలో కలెక్టర్ రాజాబాబు.. డీఈఓ రేణుక, సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, ఐసీడీఎస్ పీడీ మాధురితో త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు. మరోవైపు.. సీఐ అన్వర్ బాషా విచారణ తీరుపై తౌశిక్ తల్లిదండ్రులు అసంతృప్తి చెంది హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్యను విచారణాధికారిగా నియమించింది. ఈ నివేదికలేమీ బయటకు రాలేదు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
దీంతో ఆగ్రహించిన తౌశిక్ తల్లి ఆగస్టు 16న పాఠశాల వద్ద నిరసన దీక్ష ప్రారంభించి హాస్టల్‌ను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత నిరాహార దీక్షనూ ప్రారంభించింది. ఎటువైపు నుంచి న్యాయం జరగడంలేదని ఆవేదన చెందిన తల్లి సయ్యద్ మౌలాబీ 10వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆ వీడియోలో ‘నా కొడుకు మరణించిన చోటే నేను మరణించాలి, అతన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో అదే సమాధిలో నన్నూ పూడ్చిపెట్టాలి, నన్ను నా కుమారుడ్ని విడదీయకూడదు.. ఇదే నా చివరి కోరిక’ అని పేర్కొంది.
చికిత్స పొందుతూ మృతి..
ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మౌలాబి మృతిచెందింది. దీంతో బంధువులు పాకల అడ్డ రోడ్డు నుంచి కందుకూరు అడ్డరోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం స్టేషన్ బయట బైఠాయించారు. ఈ సందర్భంగా మౌలాబి అత్తయ్య మహబూబ్ మాట్లాడుతూ.. నా కోడలు, మనవడి మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐ శ్రీహరి బంధువులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు.


