మృతుడు కడగల శ్రీను (ఫైల్) , చికిత్స పొందుతున్న బాధితుడు ప్రసాద్
చికిత్స పొందుతూ ఒకరు మృతి
వెంటిలేటర్‌పై మరో బాధితుడు
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఒక వైద్యురాలి తీవ్ర నిర్లక్ష్యానికి కడగల శ్రీను (43) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆయన బంధువులు ఆరోపిస్తుండగా, ఆమె వల్ల 24 ఏళ్ల గరికిన ప్రసాద్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ జగన్నాథపురం తారకరామనగర్ నరసింగరోడ్‌కు చెందిన కడగల శ్రీను (43) ఆటో డ్రైవర్. తల్లి, భార్య, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం శ్రీను మెడ కుడివైపు భాగంలో కణితి వచ్చింది. ఈ నెల 8న శస్త్రచికిత్సకు కాకినాడ జీజీహెచ్‌లో సర్వం సిద్ధమైంది. శస్త్రచికిత్సకు ముందు అనస్తీషియా ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని కాన్యులా ద్వారా డిస్టిల్డ్ వాటర్‌కు బదులుగా శ్రీను నరాల్లో ఓ మందు పంపారని, మందు ఎక్కించిన పది సెకన్లలోపే శ్రీను కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. ఆర్‌ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లభించలేదు. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన శ్రీను ఈ నెల 10న ప్రాణాలు విడిచాడు.
ఇక అదేరోజు హెర్నియా శస్త్రచికిత్సకు సిద్ధమైన కాకినాడ లైట్‌హౌస్ ప్రాంతం సూర్యారావుపేటకు చెందిన 24 ఏళ్ల ప్రసాద్ పరిస్థితి కూడా ఇదే. అయితే ప్రసాద్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. సముద్రంలో వేట ద్వారా జీవనం సాగిస్తున్న ప్రసాద్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. కాగా, ఈ ఘటనలపై ఉన్నతాధికారులు త్రిసభ్య కమిటీని విచారణకు వేశారు. కమిటీ శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యురాలిని విచారించింది. తాను డిస్టిల్డ్ వాటర్ ఎక్కించానని, తనకేం తెలియదని ఆమె రాసిచ్చినట్లు తెలిసింది.
విచారణ వేదికగా వైద్యులంతా ఒకటైపోయారని బాధితులు ఆరోపించారు. వైద్యుల్లో వైద్యులే విచారణ చేసి నివేదికలు ఇచ్చేసుకోవడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. అదేమని అడిగితే వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసిన మృతుడు శ్రీను కుటుంబ సభ్యులు, దిక్కు కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


