పన్ను రాబడులకు మించి రూ.10,365 కోట్ల అప్పు
2026–27లో ఆగస్టు వరకూ బాబు ప్రభుత్వ ఆర్థిక పనితీరు
5 నెలల్లో సగటున నెలకు రూ.11 వేల కోట్లకుపైగా రాష్ట్రంపై అప్పు భారం
కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడి
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అప్పులు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో రాష్ట్ర పన్నుల రాబడి రూ.45,169 కోట్లుగా ఉందని జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
అయితే ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ రుణాలు రూ.55,534 కోట్లు. అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడిని మించి ఏకంగా రూ.10,365 కోట్లు అప్పు చేశారు. ఐదు నెలల్లో సగటున నెలకు రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ అప్పు చేస్తున్నారు. అయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున దాదాపు రూ.9,000 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఆస్తులు, అప్పుల నిష్పత్తిపై ప్రతికూలత
భారీ అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆస్తుల కల్పనపై మాత్రం అంతంతమాత్రంగానే వ్యయాలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు క్యాపిటల్ వ్యయం రూ.16,001 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. పైగా ఈ వ్యయాల్లో అత్యధిక భాగాన్ని ఫలితంలేని రంగాలకు బాబు ప్రభుత్వం మళ్లిస్తోంది. దీంతో అప్పులు పెరిగిపోయి, ఆస్తుల నిష్పత్తి తగ్గిపోనుంది.
అప్పులు చేయకుండా సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు. పైగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు మంగళం పాడటమే కాకుండా తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా చంద్రబాబు అమలు చేయడం లేదు. భారీగా అప్పులు చేస్తున్నా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి తిలోదకాలు ఇచ్చేసి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పేరుతో ప్రైవేట్‌పరం చేస్తున్నారు.


