ఏపీలో పోలింగ్‌ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి | Voting percentage announcement ten days after polling ends in 2024 elections | Sakshi
Sakshi News home page

ఏపీలో పోలింగ్‌ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి

Sep 13 2026 3:06 AM | Updated on Sep 13 2026 3:06 AM

Voting percentage announcement ten days after polling ends in 2024 elections

వాళ్లెవరో ఆధారాలతో చూపితే పాదపూజ చేస్తా

2024 ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన పది రోజులకు ఓటింగ్‌ శాతం ప్రకటన 

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల సంఘం 

రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ద్వారా దేశవ్యాప్తంగా ఇప్ప­టి వరకు 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని, వీరంతా వీధుల్లోకి వచ్చి తమ ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రము­ఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ అన్నా­రు. సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని శనివారం గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, విశ్వసనీయ­త, పౌరసమాజం కర్తవ్యం’ అనే అంశంపై పర­కాల ప్రభాకర్‌ స్మారకోపన్యాసం చేశారు. 

సర్‌ పేరు­తో సంచార జాతులు, వలస కార్మికులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని పరకాల ఆందోళన వ్యక్తంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ పూర్త­యిన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయి పోలింగ్‌ శాతాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో 2024 మే నెలలో పోలింగ్‌ పూర్తయిన తర్వాత 3,500 పోలింగ్‌ బూత్‌లలో 17.25 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని, రాత్రి 11 నుంచి తెల్లవారుజూమున 2 గంటల వరకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద నిలబడి ఓటు వేశారని ఎన్నికల కమిషన్‌ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

అలా ఓట్లు వేసినవారిని ఆధారాలతో చూపితే తాను వారికి పాదపూజ చేస్తానని పరకాల చెప్పారు. సర్‌ ప్రక్రియ ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్న ఎన్నికల సంఘం ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement