రూల్స్‌ మనమే రూపొందించాలి | Global South Needs To Be Rule-Shaper, India Ready To Take Lead says PM MODI | Sakshi
Sakshi News home page

రూల్స్‌ మనమే రూపొందించాలి

Sep 13 2026 4:50 AM | Updated on Sep 13 2026 4:50 AM

Global South Needs To Be Rule-Shaper, India Ready To Take Lead says PM MODI

రూల్స్‌ను పాటించే స్థాయిలోనే గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఉండిపోవద్దు  

బ్రిక్స్‌ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు  

అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధిద్దాం  

ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్లతో రోడ్‌మ్యాప్‌  

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రతిపాదించిన ప్రధాని నరేంద్ర మోదీ  

న్యూఢిల్లీ:  అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్‌’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్‌ మండపంలో అట్టహాసంగా మొదలైంది.

 ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్‌ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్‌ ఎమర్జెన్సీ సపోర్ట్‌ నెట్‌వర్క్‌’ఏర్పాటు చేయాలని చెప్పారు.

 బ్రిక్స్‌ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్‌ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్, ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్‌ నేతృత్వం వహిస్తోంది.  

కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్‌  
బ్రిక్స్‌ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్‌ను పోలి ఉందని చెప్పారు. 

అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్‌ సౌత్‌’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్‌ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు.  

ఉమ్మడిగా రోడ్‌మ్యాప్‌ 
మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్‌ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్‌ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. 

భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్‌ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు.  

ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం  
బ్రిక్స్‌ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్‌ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్‌ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. 

కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు.  

10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ 
1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్‌ ఎదగడం  
2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు  
3. బ్రిక్స్‌ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం  
4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 
5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి  
6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం  
7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం  
8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం  
9. గ్లోబల్‌ సౌత్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం  
10. ప్రపంచ వేదికపై బ్రిక్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చడం   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement