ఢిల్లీ: ఓ స్టార్ హోటల్ రూమ్‌లో ఎయిరిండియా పైలట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వసంత్ కుంజ్‌లో ఉన్న స్టార్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లైట్ కెప్టెన్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ది గ్రాండ్ హోటల్లోని తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని సన్నీ అసల్దేకర్‌గా పోలీసులు గుర్తించారు.
పైలట్ సెప్టెంబర్ 10న హోటల్‌లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆయన సోదరుడు హోటల్ మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో మేనేజర్ గదికి వెళ్లగా.. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మాస్టర్ కీ సహాయంతో తలుపు తెరిచి చూడగా పైలట్ స్పందన లేకుండా కనిపించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవాళ (శనివారం) తెల్లవారుజామున విధులకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సియోల్‌కు వెళ్లే విమానాన్ని నడపాల్సి ఉంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నాయి. పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేశారు. కొద్ది నెలల క్రితమే ఎయిర్ ఇండియాకు మారారు.
ఇదీ చదవండి: ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?


