దేవుడు వరమందిస్తే...! | Tollywood Star Heroes Embrace Mythological and Devotional Cinema | Sakshi
Sakshi News home page

దేవుడు వరమందిస్తే...!

Sep 13 2026 6:10 AM | Updated on Sep 13 2026 6:10 AM

Tollywood Star Heroes Embrace Mythological and Devotional Cinema

 మైథాలజీ, డివోషనల్‌ సినిమాలు చేస్తున్న స్టార్‌ హీరోలు

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ నడుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మైథాలజీ , డివోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల ట్రెండ్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘ఇరుముడి’, సూర్య తమిళ సినిమా ‘కరుప్పు’, బాలీవుడ్‌ సినిమా ‘హను మాన్‌ అంశ్‌’, యానిమేషన్‌ సినిమా ‘మహావతార్‌ నరసింహా’ చిత్రాల సక్సెస్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజీ అండ్‌ డివోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు ఏంటి? దేవుడు వరం అందిస్తే... తమకు హిట్‌ కావాలన్నట్లుగా ఏయే హీరోలు ఈ జానర్‌లో సినిమాలు చేస్తున్నారు? అన్న అంశాలపై మీరూ ఓ లుక్‌ వేయండి.

భూలోకం టు సత్యలోకం 
బ్రహ్మదేవుడి సత్యలోకం ఎలా ఉండబోతుందనేది వెండితెరపై ‘విశ్వంభర’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వంభర’. ఈ మైథాలజీ అంశాలతో కూడిన ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్స్‌గా నటించారు. కథ రీత్యా... పధ్నాలుగు లోకాలు దాటుకుని సత్యలోకంలో ఉన్న హీరోయిన్‌ను హీరో ఎలా భూలోకానికి తిరిగి తీసుకు వస్తాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, కథలో భాగంగా దొరబాబు పాత్రకు ఐదుగురు సిస్టర్స్‌ ఉంటారనే ప్రచారం సాగుతోంది. 

సురభి, రమ్య పసుపులేటి వంటి నటీమణులు ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఏడాది అక్టోబరులో దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ అవుతుందనే ప్రచారం సాగింది. 

కానీ ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్‌ కాకపోవచ్చని, వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి తొలి వారంలో (జనవరి 9న విడుదల అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌) తెరకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘కాకా’ జనవరి 13న రిలీజ్‌కి షెడ్యూల్‌ అయ్యింది. దీంతో వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్‌ అవుతుందా? లేక ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. 

రామాయణం ఆధారంగా వారణాసి 
మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని ఈ చిత్రదర్శకుడు రాజమౌళి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా కథనంలో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్, మైథాలజీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ 30 నిమిషాల సీక్వెన్స్‌లో రాముడు పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. 

భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లుగా రాజమౌళి అండ్‌ టీమ్‌ ఆల్రెడీ పేర్కొంది. దీంతో రాముడి గెటప్‌లో మహేశ్‌బాబు ఎలా ఉండబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇంకా ఈ మైథాలజీ సీక్వెన్స్‌ ‘వారణాసి’ సినిమాకు ఎంత హైలైట్‌గా ఉండబోతుంది? అన్న అంచనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నాయని తెలిసింది. రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు కనిపించనున్నారు.

 ఈ రెండు పాత్రల్లోనే కాకుండా మరో మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపిస్తారని, థియేటర్స్‌లో ఇవి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇంకా ఈ చిత్రంలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, విలన్‌ కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారని తెలిసింది. ఇక ప్రపంచ సంరక్షణ కోసం కాలాతీతంగా సాహసోపేతమైన ప్రయాణం చేసే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో  ‘వారణాసి’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

తొలిసారిగా... 
ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్‌ దేవరకొండ అర్జునుడు పాత్రలో కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటి విజయ్‌ దేవరకొండనే మెయిన్‌ హీరోగా ఓ మైథాలజీ డ్రామా వస్తే ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అందుకే ఈ తరహా సినిమాను త్వరలోనే సెట్స్‌కు తీసుకుని వెళ్లనున్నారు విజయ్‌ దేవరకొండ. ‘హాయ్‌ నాన్న’ ఫేమ్‌ శౌర్యువ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై సరైన స్పష్టత రావాల్సి ఉంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్‌. ఈ సినిమాల రిలీజ్‌ తర్వాత శౌర్యువ్‌ సినిమాను విజయ్‌ సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహించవచ్చు. 

ఇటు జై హనుమాన్‌ – అటు మహాకాళి 
ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ‘హను–మాన్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్‌ నుంచి రాబోతున్న మరో సినిమా ‘జై హను మాన్‌’. ‘కాంతార’ ఫేమ్‌ కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం ప్రధానంగా లార్డ్‌ హనుమాన్‌ నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. 

ఇందులో రానా, బాలీవుడ్‌ నటి వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని రాముడు పాత్రలో ఓ టాప్‌ టాలీవుడ్‌ స్టార్‌ నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ ‘జై హనుమాన్‌’ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అలాగే ఈ ‘పీవీసీయూ’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న మరో మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌ సినిమా ‘మహాకాళి’. ‘ది ఎండ్‌ బిగిన్స్‌’ అనేది ఈ సినిమా క్యాప్షన్‌. భూమి శెట్టి, అక్షయ్‌ ఖన్నా, శ్రేయా రెడ్డి, రోహిత్‌ సరాఫ్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘శుక్రాచార్య వార్‌ క్రై’ పేరిట ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ప్రశాంత్‌ వర్మ క్రియేటర్‌గా, పూజ అపర్ణ కొల్లూరు దర్శ కత్వంలో ఆర్కే దుగ్గల్‌ సమర్పణలో ఆర్‌కేడీ స్టూడియోస్‌ పతాకంపై రివాజ్‌ దుగ్గల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్‌ ఖన్నా, అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారని ఇటీవల విడుదలైన, గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. ఈ ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్‌ చేయనున్నట్లు  మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వడ్డీ కాసులవాడు 
మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న డివోషనల్‌ ఫిల్మ్‌ ‘వడ్డీ కాసులవాడ’. ఈ చిత్రంలో రవి మోహన్‌ (‘జయం’ రవి) వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారు. తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్నారు. అనిల్‌ సుంకర ఏటీవీ సమర్పణలో కిషోర్‌ గరికపాటి, అజయ్‌ సుంకర, దయా పన్నెం ఈ సినిమాకు సహ–నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇలా మైథాలజీ అండ్‌ డివోషనల్‌ అంశాలు మిళితమైన మరికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

దేవ సేనాపతి 
‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి యాక్షన్‌ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రెండోసారి సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. లార్డ్‌ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అండ్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లోని ‘డ్రాగన్‌’ సినిమాతో ఇటు ఎన్టీఆర్, వెంకటేశ్‌ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో అటు త్రివిక్రమ్‌ బిజీగా ఉన్నారు.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్టీఆర్‌తో తాను చేయబోయే సినిమాతో త్రివిక్రమ్‌ మరింత బిజీ అవుతారని ఊహించవచ్చు. అంతే కాదు... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ‘దేవ సేనాపతి’, ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్‌ చేయించిందట యూనిట్‌. ఈ చిత్రం 2028లో థియేటర్స్‌లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

భక్తి నేపథ్యంలో కూడిన సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందినప్పటికీ ఈ సినిమాకు కాస్త డివోషనల్‌ టచ్‌ ఉంది. అయ్యప్పస్వామి బ్యాక్‌డ్రాప్‌ని కథలో కన్విన్సింగ్‌గా మిళితం చేయడం  ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్‌ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిందని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. 

 సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజైంది). ఈ సినిమా వీరభద్రుడి స్వామి బ్యాక్‌డ్రాప్‌లో  సాగుతుంది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. 

జస్ట్‌ రూ. 2 కోట్లతో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్‌ అంశ్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా  కలెక్షన్స్‌ను సాధించి, ట్రేడ్‌ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన  ఈ బయోగ్రాఫికల్‌ డివోషనల్‌ సినిమాకు డా. విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోభిత్‌ శ్రీవాత్సవ, చందన్‌ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్‌ షెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, డా. విశాల్‌ చతుర్వేది నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. త్రివిక్రమ్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమా సంస్థ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న రిలీజ్‌ చేస్తోంది.

నయనతార నటించిన మైథాలజీ అండ్‌ డివోషనల్‌ ఫిల్మ్‌  ‘ముక్కుత్తి అమ్మన్‌ 2’ (తెలుగులో ‘మహాదేవి’) ఈ దీపావళికి రిలీజ్‌ కానుందనే ప్రచారం సాగుతోంది. సుందర్‌.సి ఈ సినిమాకు దర్శకుడు. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.

మైథాలజీ, భక్తి నేపథ్యంలో లైవ్‌ యాక్షన్‌ సినిమాలే కాకుండా, యానిమేషన్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. ‘మహావతార్‌ సినిమాటిక్‌’ యూనివర్స్‌ నుంచి ఇప్పటికే వచ్చిన యానిమేషన్‌ సినిమా ‘మహావతార్‌ నరసింహా’ 2025లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ యూనివర్స్‌ నుంచి రెండో భాగంగా       ‘మహావతార్‌ పరశురామ్‌’ 2027లో థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. మొత్తం ఏడు సినిమాలు ఈ యూనివర్స్‌ నుంచి రిలీజ్‌ కానున్నాయి. అశ్విన్‌ కుమార్‌ ఈ యానిమేషన్‌ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకొకసారి ఈ యూనివర్స్‌ నుంచి ఓ సినిమా రిలీజ్‌ అవుతుందని, అప్పట్లో మేకర్స్‌ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.  

‘బాహుబలి’ ఎంతటి బ్లాక్‌బస్టర్‌ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి    ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ అనే యూనిమేషన్‌ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది రానుంది. స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి, బాహుబలికి మధ్య వైరం ఎలా మొదలైంది? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘బాహుబలి’ని మైథాలజీ వరల్డ్‌లోకి రాజమౌళి తీసుకువచ్చారు. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ యానిమేషన్‌ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిమేషన్‌ మూవీలోని బాహుబలి పాత్రకు ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.  

‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్‌లో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. లార్డ్‌ హనుమాన్‌ ఆధారంగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మరోమారు సరైన అప్‌డేట్‌ రావాల్సి ఉంది.  

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ యానిమేషన్‌ సినిమాను తీస్తున్నారని, కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పై వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై ఓ అప్‌డేట్‌ రానుందనే ప్రచారం సాగుతోంది. ఇలా మైథాలజీ, భక్తిభావంతో కూడిన మరికొన్ని యూనిమేషన్‌ సినిమాల రూపకల్పనకు తెలుగు దర్శక– నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.  

– ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement