‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...
→ మీ ఇంట్లో పండగ ప్లాన్‌లో ఎవరి భాగం ఎక్కువ?
అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు.
→ మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ?
ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం.
→ పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా?
అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం.
→ మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్‌గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం.
→ ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా?
పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను.
→ ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా?
నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్‌లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.
→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?
నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.
→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు?
కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.
→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది...
అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.
– డి.జి. భవాని


