‘బింబిసార, సర్, విరూపాక్ష’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరోయిన్ సంయుక్త. సెప్టెంబరు 11న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న ఐదు సినిమాల అప్‌డేట్స్‌ని పంచుకున్నారు మేకర్స్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో సంయుక్త కథానాయికగా నటించారు.
పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ సెట్ ఫొటోలు విడుదల చేశారు. కాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాపో 23’ (వర్కింగ్ టైటిల్).
కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలియజేసింది యూనిట్. అదే విధంగా సంయుక్త లీడ్ రోల్‌లో యోగేష్ కేఎమ్‌సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ‘ది బ్లాక్‌గోల్డ్’ చిత్రంలోని కొత్త పోస్టర్, సంయుక్త నటిస్తున్న ‘స్వయంభు, హైందవ’ సినిమాల నుంచి కూడా పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్.


