కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..
ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
భారీ నష్టాలు?
‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.
కాగా ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.


