ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ | Ravi Teja Irumudi Generational Blockbuster Celebrations | Sakshi
Sakshi News home page

ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ

Sep 11 2026 12:42 AM | Updated on Sep 11 2026 12:42 AM

Ravi Teja Irumudi Generational Blockbuster Celebrations

రవిశంకర్, శివ నిర్వాణ, ప్రియా భవానీశంకర్, రవితేజ, నక్షత్ర

‘‘కెరీర్‌లో యావరేజ్‌ సినిమాలు, హిట్స్, ఫ్లాప్స్‌... ఇలా చాలా ఉంటాయి. కానీ...‘ఇరుముడి’ సినిమా యాక్టర్‌గా నాకు విపరీతమైన సంతృప్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సోల్‌ జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌. నిర్మాత నవీన్  ప్రతిరోజూ ఫోన్  చేసి, కలెక్షన్స్  చెబుతుండేవారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ వారి సంతోషాన్ని నాతో పంచుకునేవారు’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీశంకర్‌ హీరోయిన్ గా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెల 21న విడుదలైంది. 

గురువారం జరిగిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్ లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా అంటే శివ నిర్వాణ. ఆయనకు ఈ సక్సెస్‌ క్రెడిట్‌ దక్కుతుంది. మా అమ్మాయి మోక్షు అండ్‌ టీమ్‌ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు. 

శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘రవన్నగారితో సినిమా అంటే... దర్శకులు అనిల్, బాబీ, గోపీచంద్‌గార్లు గుర్తుకు వస్తారు. రవన్న డైరెక్టర్స్‌ లీగ్‌లో నేను చేరడం హ్యాపీగా ఉంది. నా భార్య భాగ్య ఈ సినిమా విషయంలో మీకు ఏది నచ్చితే అది  చేయమని చెప్పింది. అదే చేశాను. ఈ సినిమాతో భరించలేనంత సంతోషాన్ని నా హార్ట్‌ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఓ పెద్దావిడ ఒంటరిగా ఈ ‘ఇరుముడి’ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లారు. ఆ వీడియోను రవన్నకు పంపాను. తెలుగు రాష్ట్రాలు మా ‘ఇరుముడి’ని ఓన్  చేసుకున్నాయి. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ సంతోషంగా ఉండాలనే సినిమాలు తీస్తాను’’ అని అన్నారు.

నవీన్  ఎర్నేని మాట్లాడుతూ – ‘‘ఇరుముడి’ నిర్మించే  అవకాశం మాకు లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సినిమాకు పూనకం వస్తే బ్లాక్‌బస్టర్‌ అని, ఆడియన్స్ కు పూనకం వస్తే ‘ఇరుముడి’ సినిమా అని నా స్నేహితుడు ఒకరు నాతో అన్నారు’’ అని చెప్పారు.

వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు–సాంకేతిక నిపుణులు మా మైత్రీ ఫ్యామిలీలో యాడ్‌ అయ్యారు. ‘ఇరుముడి’ మా బ్యానర్‌లో కీరిటం లాంటిది. ఈ కీరిటంలో రవన్న, శివ నిర్వాణ వంటి వజ్రాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

ఈ వేడుకలో ‘ఇరుముడి’ టీమ్‌కి చెందిన సాయికుమార్, నక్షత్ర, జీవీ ప్రకాష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. యూనిట్‌ సభ్యులకు షీల్డులను ప్రదానం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘ఇరుముడి’ ఘనవిజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. 

దర్శకులు అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు, రచయిత బీవీఎస్‌ రవి, రచయిత–దర్శక–నిర్మాత కోన వెంకట్, నిర్మాత సాహు గారపాటి ‘ఇరుముడి’ ఘనవిజయం సాధించినందుకు యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement