సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఉంటుందని తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి సినిమా హీరో, హీరోయిన్లు అయితే ఫ్యాన్స్ జోష్ మామూలుగా ఉండదు. ఇక వారు ఎక్కడికి వెళ్లినా కవర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు మొబైల్ ఫోన్లతో సెలబ్రిటీల వీడియోలు తీసేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు... సెలబ్రిటీ కారు దిగింది మొదలు లోపలికి వెళ్లి, తిరిగి కారు ఎక్కేవరకు వారిని వెంబడిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలు ఒక్కోసారి సెలబ్రిటీలకు విసుగు పుట్టిస్తుంటాయి.
తాజాగా హీరోయిన్ తారా సుతారియాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే... తారా సుతారియా ముంబైలోని బాంద్రాలో ఓ ప్రదేశానికి వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. లోపలికి వెళుతుండగా మొబైల్ ఫోన్ పట్టుకుని అతి సమీపంలోకి వచ్చి వీడియో తీస్తున్న ఓ వ్యక్తి ఫోన్‌ను పక్కకు నెట్టేసి, లోపలికి వెళ్లారామె.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారా సుతారియా తన వ్యక్తిగత భద్రతను కాపాడుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ పలువురు నెటిజన్లు తమ కామెంట్స్‌తో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ‘‘భలే మంచి పని చేశావ్ తారా... ఇలా మీద మీదకు వచ్చి ముఖానికి దగ్గరగా ఫోన్ పెట్టి, ఫొటో తీయడం ఏ మాత్రం సరికాదు’’ అంటూ కామెంట్స్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’లో కీలక పాత్ర చేసిన తారా సుతారియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.


