ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా.. | Vinayaka Chavithi festival hit by farmers crisis | Sakshi
Sakshi News home page

ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..

Sep 13 2026 8:19 AM | Updated on Sep 13 2026 8:27 AM

Vinayaka Chavithi festival hit by farmers crisis

ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. 
ఏటా ఖరీఫ్‌ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి.  
ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. 

ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  

మా మొర నువ్వైనా వింటావా.. 
గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్‌ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ.  
    ఇట్లు.. 
  గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement