మాజీ ఎంపీ ప్రజ్వల్ మొబైల్‌లో 173 వీడియోలు
వాటిలో ఎక్కువగా అశ్లీల వీడియోలే..
పెన్‌డ్రైవ్‌లో మరో వంద వీడియో ఫైళ్లు
జైలు నుంచే మహిళలతో వీడియో కాల్స్
యశవంతపుర: మహిళపై లైంగిక దాడి కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బాగోతాలు మళ్లీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా జైలులో ఆయన వద్ద లభించిన స్మార్ట్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, 173 వీడియో ఫైళ్లు ఉన్నట్లు తేలింది. వీటిలో చాలా వరకు అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. మరో పెన్‌డ్రైవ్‌లో 100 వీడియోలను పోలీసులు గుర్తించారు. వీటిలోనూ అశ్లీల వీడియోలు, హింసాత్మకమైన కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా జైలు నుంచే ప్రజ్వల్ అనేకమంది మహిళలకు వీడియో కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సాధారణ కాల్ డేటాలో దొరకకుండా ఉండేందుకు కొందరితో వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు నిర్ధారించారు. అయితే, వారు ఎవరు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. జైలు బ్యారక్‌లో ఉన్న టీవీకి పెన్‌డ్రైవ్‌ను అమర్చి అందులోని సినిమాలు, వీడియోలను ప్రజ్వల్ చూసేవారు. పెన్‌డ్రైవ్‌ను మరింత క్షుణ్ణంగా పరీక్షించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.
కాగా, ప్రజ్వల్‌ను పరప్పన అగ్రహార ఠాణా పోలీసులు ఇటీవల విచారించే సమయంలో... ‘నేనెవరో తెలుసా.. మాజీ ఎంపీని. నేను ఏమీ చెప్పేది లేదు.’ అని దబాయించారని పోలీసులు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణకు జైల్లో మొబైల్ ఫోన్ ఇచ్చింది ఓ జైలు వార్డర్ అని పోలీసులు గుర్తించారు. గతంలో డీజే హళ్లి ఘర్షణల కేసులో జైల్లో ఉన్న నిందితుడు వాడిన మొబైల్‌ను ప్రజ్వల్‌కు చేరవేసినట్లు తేలింది.


