పోలీసు రిక్రూట్‌మెంట్‌పై.. అన్నీ అనుమానాలే! | Chandrababu Govt: Widespread suspicions regarding police recruitment | Sakshi
Sakshi News home page

పోలీసు రిక్రూట్‌మెంట్‌పై.. అన్నీ అనుమానాలే!

Sep 13 2026 5:24 AM | Updated on Sep 13 2026 5:24 AM

Chandrababu Govt: Widespread suspicions regarding police recruitment

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ వాయిదాతో సర్వత్రా చర్చ

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 2022లో 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ 

ప్రిలిమినరీ, ఫిజికల్‌ టెస్ట్‌లు, పరుగు పందెం అప్పుడే పూర్తి

2022 నోటిఫికేషన్‌ రివైజ్‌ చేస్తూ 2025లో సవరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 

అందులో 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులను చూపించిన వైనం 

దీంతో పోస్టుల సంఖ్య 6,179కి పెరగాలి.. కానీ 6,100తోనే రిక్రూట్‌మెంట్‌ 

బ్యాక్‌లాగ్‌ పోస్టులను స్పోర్ట్స్‌ కోటాలో భర్తీచేసేలా ఉత్తర్వులు 

బ్యాక్‌లాగ్‌తో కలిపి స్పోర్ట్స్‌ కోటాలో 262 పోస్టులు భర్తీ 

వీటి నియామకంపైనే అభ్యర్థులతో పాటు పోలీసు అధికారుల్లో తీవ్ర అనుమానాలు 

శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఏ కేటగిరిలో ఉద్యోగం పొందారో వెల్లడించని ప్రభుత్వం 

ఈనెల 7న జరగాల్సిన పీఓపీ వాయిదాతో ముసురుకుంటున్న అనుమానాలు

డీఎస్సీ తరహాలోనే కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో కూడా భారీగా అవకతవకలు జరిగాయా? ఈనెల 7న పీఓపీ (పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌)కి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి? శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అసలు ఏ కేటగిరీలో, ఏ రిజర్వేషన్‌లో ఉద్యోగం పొందారో సెలక్షన్‌ లిస్ట్‌ ఇప్పటివరకూ పబ్లిక్‌ డొమైన్‌లో ఎందుకు ఉంచలేదు? బ్యాక్‌ లాగ్‌ పోస్టులను పూర్తిగా స్పోర్ట్స్‌ కోటాలోనే భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో చేర్చిన ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఎందుకు పొందుపరచలేదు? ఈ సందేహాలన్నీ చూస్తే అసలు  పోలీసు రిక్రూట్‌మెంట్‌ పారదర్శకంగానే జరిగిందా? లేదా స్పోర్ట్స్‌ కోటా ముసుగులో ‘యువగళం’ కోటాగా కొన్ని పోస్టులు టీడీపీ నేతలకు అప్పనంగా ఇచ్చారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: దగా డీఎస్సీ స్కామ్‌ తరహాలోనే పోలీసు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు దిగజారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6,100 పోస్టులతో మొదలైన ప్రక్రియలో 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులను కొత్తగా చేర్చిన ప్రభుత్వం.. మొత్తం పోస్టుల సంఖ్యను మాత్రం 6,100గానే ఉంచడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. మరోవైపు 3 శాతం స్పోర్ట్స్‌ కోటా కింద 183 పోస్టులతో పాటు 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులనూ అదే కోటాలో భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం 262 పోస్టుల నియామకంపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ, ఫిజికల్‌ పరీక్షలు పూర్తయి, మెయిన్స్‌ అనంతరం ఎంపికైన అభ్యర్థులు తొమ్మిది నెలల శిక్షణ కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ఎవరు ఏ రిజర్వేషన్, ఏ కేటగిరీలో ఎంపికయ్యారు? స్పోర్ట్స్, బ్యాక్‌లాగ్‌ కోటాలో ఎవరికి ఉద్యోగాలు దక్కాయి? అనే వివరాలతో కూడిన తుది సెలక్షన్‌ జాబితాను ప్రభుత్వం బహిరంగపరచలేదు. దీనికితోడు ఈ నెల 7న జరగాల్సిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేయడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. దీంతో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ నిజంగా పారదర్శకంగానే జరిగిందా? లేక స్పోర్ట్స్‌ కోటా ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్‌ 28న 6,100 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫిజికల్‌ టెస్ట్‌లు, పరుగు పందెం అప్పుడే పూర్తిచేశారు. ‘మెయిన్స్‌’ నిర్వహించే క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో రిక్రూట్‌మెంట్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2025 జూన్‌ 1న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రాష్ట్రంలోని 21 పీటీసీ, డీటీసీ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు.  

79 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎక్కడ ‘బాబూ’?.. 
2022 నవంబర్‌ 28న జారీ అయిన నోటిఫికేషన్‌లో 6,100 పోస్టులున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2025 జులై 30న 2022 నోటిఫికేషన్‌ను రివైజ్‌ చేస్తూ అమెండ్‌మెంట్‌ తీసుకొచ్చింది. 6,100 పోస్టులతోనే రిక్రూట్‌మెంట్‌ ఉన్నప్పుడు కొత్తగా మళ్లీ అమెండ్‌మెంట్‌ ఎందుకు? అలాగే, 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొన్నారు. మరి 6,100 పోస్టులతో పాటు 79 బ్యాక్‌లాగ్‌ కలిపితే మొత్తం 6,179 పోస్టులు రిక్రూట్‌ చేయాలి కదా? ఎందుకు పోస్టుల సంఖ్య పెరగలేదు? అనేది ఇప్పుడు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.  

79 పోస్టులు స్పోర్ట్స్‌ కోటాలో భర్తీకి ఉత్తర్వులు
మొత్తం 6,100 పోస్టుల్లో 3 శాతం స్పోర్ట్స్‌ కోటాలో భర్తీచేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓలు జారీచేసింది. ఈ లెక్కన 183 పోస్టులు స్పోర్ట్స్‌ కోటాలో భర్తీచేయాలి. అలాగే, బ్యాక్‌లాగ్‌ పోస్టులను కూడా స్పోర్ట్స్‌ కోటాలోనే భర్తీచేయాలని పేర్కొన్నారు. అంటే.. 183 పోస్టులతో పాటు 79 బ్యాక్‌లాగ్‌ కలిపి మొత్తం 262 ఉద్యోగాలు స్పోర్ట్స్‌ కోటాలో భర్తీచేసినట్లు లెక్క. పైగా.. బ్యాక్‌లాగ్‌ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియామకాలు చేసేలా అమెండ్‌మెంట్‌  చివరి కాలమ్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు స్పోర్ట్స్‌ కోటాలో గతంలో ఉన్న 20 క్రీడలను 67కు పెంచుతూ జీఓలు జారీచేశారు. కానీ, మొత్తం రిక్రూట్‌మెంట్‌ మాత్రం 6,100కే జరిగింది. మరి అలాంటప్పుడు 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎలా భర్తీచేశారు? ఎవరితో భర్తీచేశారు? బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీచేస్తే 6,100కే రిక్రూట్‌మెంట్‌ ఎలా పరిమితం చేశారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.  


రిజర్వేషన్, కేటగిరి ప్రకారం సెలక్షన్‌ లిస్ట్‌ ఎక్కడ?.. 
ఇక రిక్రూట్‌మెంట్‌ చేసిన 6,100 పోస్టుల్లో కొందరికి వేరే ఉద్యోగాలు రావడం, ఇంకొందరు శిక్షణకు రాకపోవడం.. ఇతర కారణాలతో వెళ్లిపోయిన వారు కాకుండా మిగిలిన 5,757 మంది తొమ్మిది నెలలపాటు శిక్షణ పూర్తిచేసుకున్నారు. మెయిన్స్‌ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు శిక్షణకు ఎంపిక కాగానే ఏ అభ్యర్థి ఏ రిజర్వేషన్, ఏ కేటగిరిలో ఎంపికయ్యారు? బ్యాక్‌లాగ్, స్పోర్ట్స్‌ కోటాలో ఎవరు ఎంపికయ్యారు అనే వివరాలతో ఎంపిక జాబితాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి. కానీ, అభ్యర్థులు తొమ్మిది నెలలు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత, చివరకు ఈనెల 7న పీఓపీ తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకూ సెలక్షన్‌ లిస్ట్‌ను రిజర్వేషన్, కేటగిరీ వారీగా ప్రకటించలేదు. దీన్నిబట్టి చూస్తే రిజర్వేషన్, కేటగిరి వివరాలు ఎందుకు ప్రభుత్వం గోప్యంగా ఉంచిందనేది అంతుపట్టడంలేదు.

స్పోర్ట్స్‌ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..
రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్‌ఎల్‌పీఆర్‌బీ (స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్‌ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్‌ కోటాలో స్థాని­కులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్‌మెంట్‌లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్‌ లిస్ట్‌ రిజర్వేషన్‌ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్‌లాగ్‌ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.  

2022లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను మార్పు చేసి 2025లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ 

స్పోర్ట్స్‌ కోటాలోని 262 పోస్టుల భర్తీపైనే అనుమానాలు..
రిజర్వేషన్ల ప్రకారం ఎస్పీలు జిల్లాల వారీగా ఎంపిక జాబితాను డీజీపీకి పంపిస్తారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఇలా అన్ని విభాగాల్లో పోస్టుల ఖాళీలను డీజీ పరిశీలించి ఎస్‌ఎల్‌పీఆర్‌బీ (స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు)కు పంపిస్తారు. అప్పుడు ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రిలిమినరీ, ఫిజికల్, రన్నింగ్, మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, ఈ ఉదంతంలో పోస్టుల జాబితాతో పాటు మెయిన్స్‌ మినహా మిగిలిన ప్రక్రియ మొత్తం 2022లోనే పూర్తయింది. మళ్లీ 79 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేస్తున్నట్లు అమెండ్‌మెంట్‌లో పేర్కొనడం, వాటిని స్పోర్ట్స్‌ కోటాలో స్థాని­కులతోనే భర్తీచేసేలా చెప్పడం.. కానీ, ఈ 79 సంఖ్య మొత్తం రిక్రూట్‌మెంట్‌లో పెరగకపోవడం, శిక్షణ పూర్తిచేసుకున్నా ఇప్పటివరకూ అభ్యర్థుల సెలక్షన్‌ లిస్ట్‌ రిజర్వేషన్‌ వారీగా ప్రకటించకపోవడంపై 92 వేల మందికి పైగా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలోని 183 పోస్టులు, బ్యాక్‌లాగ్‌ 79 పోస్టులు కలిపి మొత్తం 262 పోస్టుల నియామకంపైనే తీవ్ర అనుమానాలు ఉన్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement