ఠారెత్తిస్తున్న నిత్యావసరాల ధరలు
ధరల నియంత్రణను పట్టించుకోని చంద్రబాబు సర్కారు
బియ్యం, పప్పులు, బెల్లం, నూనెల ధరలు ఆకాశానికి
కూరగాయలు, పూజా సామగ్రి ధరలూ విపరీతంగా పెరుగుదల
రెట్టింపయిన పండుగ బడ్జెట్.. ఒక్కో కుటుంబంపై రూ.2 వేల వరకు అదనపు భారం
పేద, మధ్యతరగతి ఇళ్లలో కానరాని ఘుమఘుమలు
సాక్షి, అమరావతి: భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవతి తెలుగు వారింట తొలి పండుగ. ఊరూ వాడా పందిళ్ల సందడి. ప్రతి ఇంటా కొత్త బట్టలు.. నోరూరించే పిండివంటల ఘుమఘుమలు. కానీ ఈ ఏడాది సామాన్య, మధ్య తరగతి ప్రజల లోగిళ్లలో పండుగ శోభ మచ్చుకైనా కనిపించడంలేదు. అనూహ్యంగా పెరిగిన ధరలు తొలి పండుగపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల జేబులు గుల్లవుతున్నాయి.
కానరాని ఘుమఘుమలు..
వినాయక చవితి అనగానే ప్రతి ఇంటా పులిహోర, బూరెలు, గారెలతో పాటు స్వామి వారికి నైవేద్యంగా పెట్టే కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం వంటి సంప్రదాయ పిండి వంటలు తప్పనిసరి. ఇంటికొచ్చే బంధువులతో పాటు పిల్లలు, అల్లుళ్లకు కొత్తబట్టలు పెట్టడం సంప్రదాయం. అలాంటిది పెరిగిన ధరలతో ఏది వండుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు, పాలు, వాటి ఉత్పత్తుల ధరలే కాదు వినాయక వ్రతానికి ఉపయోగించే పూలు, పండ్ల, ఇతర పూజా సామాగ్రి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి.
గతంతో పోలిస్తే ధరలు 30 నుంచి 75 శాతం, కొన్ని వస్తువుల ధరలైతే ఏకంగా 100–150 శాతం మేర పెరిగాయని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఏ వస్తువు కొందామన్నా భయపడే పరిస్థితి. దీంతో దాదాపు 40 శాతం మంది పిండివంటలకు దూరమయ్యే దుస్థితి నెలకొందని చెబుతున్నారు. ఫలితంగా పూజా సామాగ్రి, పిండి వంటల తయారీకి ఉపయోగించే వస్తువులకు గతేడాది రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేసిన కుటుంబాలు ఈసారి రూ.2 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక కొత్త బట్టల ఆలోచనే చేయలేని పరిస్థితి.
చవితి పందిళ్లపైనా ధరల ప్రభావం..
వినాయక చవితి అంటే పల్లెలు, పట్టణాల్లో వీధి వీధినా పందిళ్లు వేసి గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని నవరాత్రులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటిది నేడు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు పల్లెల్లో సైతం చవితి పందిళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ ఆంక్షలతో పాటు బహిరంగ మార్కెట్‌లో పెరిగిన ధరల ప్రభావం కూడా వీటిపై కని్పస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 30–40 శాతం మేర చవితి పందిళ్ల సంఖ్య తగ్గిందని దరఖాస్తుల సంఖ్య వెల్లడిస్తోంది.

పండుగ వస్తుందంటే భయంగా ఉంది..
మాది వ్యవసాయ కుటుంబం. ఓ వైపు గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నాం. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలతో రోజు గడవడమే కష్టంగా మారింది. పండుగ వస్తుందంటే భయపడే పరిస్థితి. పిల్లలకు కొత్త బట్టలు కొనడం కాదు కదా.. కనీసం పండుగ పూట ఇంట్లో పిండివంటలు చేసుకునేందుకు కూడా ఆలోచించాల్సి వస్తోంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. – ఆత్మకూరి శ్రీనివాసరావు, పెరవలిపాలెం, బాపట్ల జిల్లా
పిల్లలు నోరు తెరిచి అడిగినా..
పండుగ వస్తుందంటే ఇంట్లో ఎంతో సందడిగా ఉండేది. పిల్లల కోసం పోటీపడి పిండివంటలు చేసేవాళ్లం. కనీసం రెండు మూడు రకాలు వండేవాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బియ్యం నుంచి బెల్లం వరకు, కూరగాయల నుంచి నూనె వరకు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లలు నోరు తెరిచి పండుగ పూట ఏదైనా వండమ్మా అని అడిగితే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. రానురాను పండుగలకు దూరమై పోతున్నాం. – వన్నెంరెడ్డి సంతోషి, శ్రీనగర్ కాలనీ, కృష్ణా జిల్లా
పూజలో ఉపయోగించే ఇతర సామాగ్రి ధరలు కూడా 50–80 శాతం మేర పెరిగాయి.
పాలధర ఇప్పటికే లీటర్ రూ.80కి చేరింది. వినాయక చవితికి లీటర్‌కు మరో రూ.2 పెంచేందుకు ప్రైవేటు, సహకార డెయిరీలు సిద్ధమయ్యాయి.


