‘బాబో’య్‌ ధరాఘాతం | Food inflation inches up to 9. 13 percent in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘బాబో’య్‌ ధరాఘాతం

Sep 13 2026 5:27 AM | Updated on Sep 13 2026 5:27 AM

Food inflation inches up to 9. 13 percent in Andhra Pradesh

రాష్ట్రంలో ఆహార ద్రవ్యోల్బణం 9.13 శాతం 

ప్రణాళికా శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: ధరల మంటతో సామా­న్యుడు అల్లాడుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యావసరాలు, ఆహార ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభు­త్వం విఫలమవుతోంది. తాజాగా అధికారికంగా విడుదలైన రాష్ట్ర ప్రణాళికా శాఖ నివేదికే కూటమి సర్కారు పాలనలో ధరల పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2025 జూలైతో పోల్చి 2026 జూలైలో రాష్ట్ర వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 9.13 శాతంగా నమోదయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యో­ల్బ­­ణం ఏకంగా 9.69 శాతానికి చేరడం.. సామాన్య కుటుంబాలపై ధరల భారానికి నిదర్శనం.  జిల్లా స్థాయిలో నిత్యావసర ధరల పరిస్థితిపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని నివే­దిక సూచించింది.  రాష్ట్ర ప్రణాళికా శాఖ  వెల్లడించిన సమాచారం ప్రకారం.. 

వార్షిక ప్రాతిపదికన అన్ని విభాగాలను కలిపిచూస్తే రాష్ట్ర వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.72 శాతంగా నమోదయ్యింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేర్వేరుగా చూస్తే గ్రామాల్లో సీపీఐ  6.13 శాతంగా ఉంటే, పట్టణాల్లో 5.19 శాతంగా నమోదయ్యింది.  
రాష్ట్రంలో ఒక్క ఆహార ద్రవ్యోల్బణం చూస్తే 9.13 శాతంగా నమోదయ్యింది. గ్రామాల్లో ఇది మరింత ఎక్కువగా 9.69 శాతంగా నమోదుకావడం గమనార్హం.  

రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం విభాగాన్ని చూస్తే వార్షికంగా ఉల్లి ధరలు ఏకంగా 153 శాతం ఎగిశాయి. అల్లం ధరలు 102.9 శాతం ఎగశాయి. చికెన్‌ ధరలు 37.3 శాతం ఎగశాయి. ఎండుమిర్చి ధరలు 30 శాతం పెరిగాయి.  నెలవారీగా ఉల్లి, టమాటా చూసినా (2026 జూన్‌తో పోల్చి 2026 జూలైలో) ధరలు భారీగా 54 శాతం, 46 శాతం చొప్పున పెరగడం గమనార్హం.  

సీపీఐలో భాగమైన వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ  ధరలు వార్షికంగా 18.80 శాతం పెరిగాయి.  
ఆహారం, పానీయాలు ధరలు 8.51 శాతం, విద్యా సేవలు ధరలు 7.62 శాతం, రెస్టారెంట్, వసతి ధరలు 5.73 శాతం, రవాణా ధరలు 3.99 శాతం పెరిగాయి.   
వెండి ఆభరణాల ధరలు వార్షికంగా 108.9 శాతం పెరగ్గా, గోల్డ్, డైమండ్, ప్లాటినం ఆభరణాల ధరలు 27.72 శాతం ఎగశాయి.  

జాతీయ స్థాయిలో చూస్తే 1.27 శాతం అధికం 
కాగా, జాతీయ స్థాయిలో జూలైలో సీపీఐ వార్షిక ప్రాతిపదికన 4.45 శాతంగా నమోదవగా, రాష్ట్రంలో 5.72 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో ఇది 1.27 శాతం అధికం. ఒక్క దక్షిణాది రాష్ట్లాల జాబితాలో టాప్‌ నుంచి (6.32 శాతంతో తెలంగాణ) రెండవ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తరువాతి స్థానాల్లో తమిళనాడు (5.44 శాతం), కర్ణాటక (4.89 శాతం) కేరళ (4.85 శాతం) ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement