పారామెడికల్‌ విద్యార్థులపై ఖా‘కీచకం’ | Students peacefully rallying for stipend in Tirupati | Sakshi
Sakshi News home page

పారామెడికల్‌ విద్యార్థులపై ఖా‘కీచకం’

Sep 13 2026 4:01 AM | Updated on Sep 13 2026 4:01 AM

Students peacefully rallying for stipend in Tirupati

తిరుపతిలో స్టైపెండ్‌ కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులు 

అడ్డుకుని విద్యార్థినిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు 

అలిపిరి వద్ద ఉద్రిక్తత.. భయభ్రాంతులకు లోనైన విద్యార్థులు  

క్రూరంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌  

సాక్షి టాస్క్ ఫోర్స్‌: తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద  స్టైపెండ్‌ కోసం నిరసన తెలుపుతున్న పారా మెడికల్‌ విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం నిరసనలో భాగంగా పారామెడికల్‌ విద్యార్థులు తిరుపతి రుయా ఆసుపత్రి ధర్నా శిబిరం నుంచి అలిపిరి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వీరికి మద్దతుగా తిరుపతి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ ర్యాలీలో పాల్గొంది. అలిపిరి సర్కిల్‌ వద్ద అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థుల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

శాంతియుతంగా న్యాయమైన డిమాండ్లపై ధర్నా చేస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని విద్యార్థులు పోలీసులను నిలదీశారు. దీంతో అలిపిరి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచక్షణ కోల్పోయిన పోలీసులు నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఏం తప్పు చేశాం.. ఎందుకు అరెస్ట్‌ చేస్తారని విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడ్డుపడటంతో ఆగ్రహించిన పోలీసులు పశువులను ఈడ్చినట్లు విద్యార్థులను ఈడ్చుకెళ్లారు. 

జుట్టుపట్టి ఈడ్చుకుంటూ.... 
పారామెడికల్‌ విద్యార్థుల సమస్యలపై నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయా ఆసుపత్రి సర్కిల్‌ నుంచి అలిపిరి వరకు ర్యాలీ చేస్తుండగా,  పోలీసులు అడ్డుకుని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు సునీతను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ఇంత దారుణంగా విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైనా పోలీసులు ప్రవర్తించడం గతంలో ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు సంబం«ధించి వీడియోలు బయటకు వెళితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.  

భయభ్రాంతులతో పరుగులు పెట్టిన విద్యార్థినులు 
అలిపిరి వద్ద జరిగిన సంఘటనతో స్థానిక ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును వారు ప్రత్యక్షంగా చూసి ఆందోళన చెందారు. విద్యార్థులు వదలండి అంటూ కేకలు పెడుతున్నా వినకుండా అత్యంత క్రూరంగా లాగడంతో నిరసన తెలుపుతున్న విద్యార్థినులలో కొందరు భయభ్రాంతులకు లోనై రుయా ఆసుపత్రి వైపు పరుగులు పెట్టారు.   

విద్యార్థులపై దౌర్జన్యం దారుణం 
శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి తిరిగి వస్తున్న విద్యార్థినులపై పోలీసులు విరుచుకు­పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు  ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు సునీతను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థి నాయకులు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షనం ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు.  

సమస్యలపై గళమెత్తిన విద్యార్థులపై తిరుపతి పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఐద్వా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి పేర్కొన్నారు. కాగా తిరుపతి గరుడ సర్కిల్‌ వద్ద జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని, విద్యార్థిని చేయి పట్టుకుని లాగే క్రమంలో అనుకోకుండా జుట్టు కూడా చేతికి చిక్కినట్లు ఫొటోలో కనిపిస్తోందని ఏఎస్పీ రవిమనోహరా చారి అన్నారు. అయినప్పటికీ ఏఎస్సై లక్ష్మీకుమారిని వీఆర్‌కు పంపించినట్లు ఆయన తెలిపారు. 

హక్కుగా రావాల్సిన స్టైపెండ్‌ అడిగితే అమానుషంగా దాడిచేస్తారా 
హక్కుగా రావాల్సిన స్టైపెండ్‌ చెల్లించాలని, తమ చదువులు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద నిరసన చేపట్టిన పారామెడికల్‌ విద్యార్థులపై పోలీసులు చేసిన దాడి అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థినులను జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లడం దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలి.  – డాక్టర్‌ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement