జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో జ్యోతికి రెండో స్థానం వచ్చినట్టు రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్ సంతకంతో ఇచ్చిన ఫారం–2 , జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న జ్యోతికి వచ్చిన పార్టిసిపేషన్ పత్రం
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో మరో అనుమానాస్పద ఫారం–2
నేషనల్స్‌లో పార్టిసిపేట్ చేస్తే.. సిల్వర్ మెడల్ వచ్చినట్టు ధ్రువీకరణ!
ఫారం–2పై కార్యదర్శికి బదులు కూన రవికుమార్ సంతకం
ఈ ధృవపత్రంతోనే డీఎస్సీ–2025లో ఉద్యోగం
విజయనగరం అర్బన్: మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో క్రీడా అర్హతల్లో అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ పోస్టులకు దూరమైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. మరో అనుమానాస్పద ఫారం–2 వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో కేవలం పాల్గొన్న అభ్యర్థికి ఏకంగా ‘సిల్వర్ మెడల్’ సాధించినట్టు ఫారం–2 జారీ చేయడం, ఆ పత్రంపై నిబంధనల్లో పేర్కొన్న అధికారి కాకుండా రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్ సంతకం ఉండటం వివాదాస్పదంగా మారింది.
‘పార్టిసిపేషన్’ మాత్రమే.. మెడల్ సృష్టించారు
విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కోట లీలా శివజ్యోతి 2021 డిసెంబర్ 24 నుంచి 28 వరకు అనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నారు. ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఆమెకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మాత్రమే లభించినట్లు తెలుస్తోంది. అయితే.. అదే పోటీలో ఆమె రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలిచినట్లు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ సంఘం నుంచి ఫారం–2 జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ ధృవపత్రంపై రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండగా.. అదే పోటీలో రెండో స్థానం సాధించినట్లు ఫారం–2 ఎలా జారీ అయింది? అసలు సిల్వర్ మెడల్ సాధించినట్లు నిర్ధారించే ఆధారం ఏమిటి? అన్న ప్రశ్నలు క్రీడావర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఫారం–2 ఆధారంగానే ఉద్యోగమా?
డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో కేవలం పోటీల్లో పార్టీసిపేషన్ సర్టిఫికెట్లకు ప్రాధాన్యం ఉండదు. అభ్యర్థి సాధించిన క్రీడా ప్రతిభ, పొందిన స్థానం, నిబంధనల్లో నిర్దేశించిన ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరగాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభకు సంబంధించిన ధృవపత్రాలతో పాటు సంబంధిత ఫారాలను సమర్పించాలని అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాల్గొన్నట్లు ఉన్న ధృవపత్రంతో సిల్వర్ మెడల్ స్థాయి క్రీడా అర్హతను చూపించడం ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఈ ఫారం–2 ఆధారంగానే అభ్యర్థికి డీఎస్సీ–2025లో ఉద్యోగం లభించినట్లు తెలుస్తోంది.
స్థానికతపైనా అనుమానాలు
అభ్యర్థి స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే, విశాఖ జిల్లా స్థానికతతో 42 సంవత్సరాల వయసులో స్కూల్ అసిస్టెంట్ మేథమెటిక్స్ పోస్టు నియామక ఆదేశాలు వచ్చాయి. భర్త చొక్కాపు సత్యనారాయణ విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు ఇదే సాఫ్ట్‌బాల్ క్రీడా అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా భర్త సత్యనారాయణ వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
అధ్యక్షుడి సంతకం.. నిబంధనల్లో మాత్రం కార్యదర్శి!
2025 క్రీడా కోటా మార్గదర్శకాల్లోని ఫారం–2లోనే.. ఆ ధృవపత్రం నేషనల్ ఫెడరేషన్ సెక్రటరీ లేదా సంబంధిత స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ వ్యక్తిగతంగా సంతకం చేసినప్పుడే చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అభ్యర్థి సమర్పించినట్లు చూపుతున్న ఫారం–2లో సంతకం చేసిన వ్యక్తి హోదా ప్రెసిడెంట్‌గా ఉంది. దీంతో ప్రెసిడెంట్ సంతకంతో జారీ చేసిన ఫారం–2ను అధికారులు క్రీడా ధృవపత్రంగా ఎలా పరిగణిస్తారన్న ప్రశ్న క్రీడావర్గాల నుంచి తలెత్తుతోంది.


