సోషల్ మీడియా క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని ఘరానా మోసాలు
ఉద్యోగాలు.. బెట్టింగ్‌లు.. పెట్టుబడులు.. ప్రకటనల పేరుతో వల
33% ప్రకటనల్లో నిషేధిత ఉత్పత్తులు, సేవలపై ప్రచారం
31.4% ప్రకటనల్లో అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లు
ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై పెరుగుతున్న ఫిర్యాదులు
విస్తుగొలుపుతున్న అధ్యయనాలు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు సెలబ్రిటీల మాటకే విలువ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హవా నడుస్తోంది. ఒక్క వీడియో పెడితే చాలు.. వేల నుంచి లక్షల మంది నమ్మే పరిస్థితి. ఇదే నమ్మకాన్ని కొందరు ఘరానా మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని, పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామని, బెట్టింగ్‌లో ‘ఫిక్స్‌డ్ టిప్స్’ ఇస్తామని చెప్పి బాధితులను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజాగా ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన వ్యవహారం ఈ ప్రమాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. లండన్‌లో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆమె, భర్త జె.మధుకర్‌పై కేసు నమోదైంది. లుక్‌ఔట్ నోటీసు నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ఈ వ్యవహారం ఇన్‌ఫ్లుయెన్సర్లు, మోసాలు, వివాదాల అంశాలను మరోసారి తెరమీదకు తెచ్చింది.
ఆందోళనకర అంశాలు
⇒ ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల తీవ్రతను అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)సహా పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
⇒ 2024–25లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించిన 1,015 ప్రకటనలను పరిశీలించగా.. ఏకంగా 98 శాతం ప్రకటనల్లో మార్పులు అవసరమని గుర్తించారు. వీటిలో 33 శాతం చట్టం నిషేధించిన ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసినవి. అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లు 31.4 శాతంతో ముందున్నాయి.
⇒ 2024లో ఏఎస్‌సీఐ నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో టాప్ డిజిటల్ స్టార్ల పోస్టుల్లో 69 శాతం డిస్‌క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.
అంటే పెయిడ్ ప్రమోషన్, బ్రాండ్‌తో తమకు ఉన్న సంబంధాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పకుండా ఏదైనా ఒక వస్తువును, సేవను ప్రోత్సహిస్తూ చేసిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నమాట.
⇒ దేశవ్యాప్తంగా 2021–25 మధ్య నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు 65.89 లక్షలకు పైగా ఆర్థిక మోసాల ఫిర్యాదులు అందగా.. ప్రజలు కోల్పోయినట్లు నివేదించిన మొత్తం రూ.55,050 కోట్లకుపైగా ఉంది.
⇒ 2024లో దేశవ్యాప్తంగా 86,420 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఏపీలో 2024లో 2,528, తెలంగాణ 18,236 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పోలీసుల 2024 నివేదికలో 4,042 సైబర్ నేర కేసులు నమోదైనట్లు ఉంది. వీటిలో 296 కేసులు సోషల్ మీడియాకు సంబంధించినవి. 145 ఉద్యోగ మోసాలు, 926 ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, 563 ట్రేడింగ్ మోసాలుగా నమోదయ్యాయి. ఈ మొత్తం మోసాల్లో నష్టం దాదాపు రూ.296.32 కోట్లుగా నమోదైంది.
మోసాలు.. కేసుల తీరు
⇒ 2025లో సైబరాబాద్ పోలీసులు టెలిగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, అనధికార బెట్టింగ్ వెబ్‌సైట్లు, మ్యూల్ ఖాతాలతో నడుస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించి నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అరెస్టు చేశారు. ‘ఫిక్స్‌డ్ మ్యాచ్‌లు’, ‘ఎక్స్‌క్లూజివ్ టిప్స్’ పేరుతో యువతను బెట్టింగ్ వైపు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.
⇒ మరో ఘటనలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్, నకిలీ మ్యాట్రిమోనీ ప్రొఫైళ్లతో మోసాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నారు. ఒక బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ప్రొఫైళ్లలో ఓ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫొటోను కూడా ఉపయోగించినట్లు వెల్లడైంది.
⇒ అంతర్జాతీయ ట్రావెలర్‌గా పేరొందిన ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ కూడా తన నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలకుగానూ
అతనిపై లుక్‌ఔట్ నోటీస్ జారీ అయ్యింది.
⇒ ఫన్ బకెట్ భార్గవ్‌పై ఏకంగా లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష కూడా పడింది.


