వైద్యులను పెంచాలి.. పనిభారం తగ్గించాలి | Government Hospitals Struggle as New Posts Fail to Match Patient Load | Sakshi
Sakshi News home page

వైద్యులను పెంచాలి.. పనిభారం తగ్గించాలి

Sep 13 2026 5:49 AM | Updated on Sep 13 2026 5:49 AM

Government Hospitals Struggle as New Posts Fail to Match Patient Load

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సంఖ్యకు తగ్గట్లుగా కొత్త పోస్టులు పెరగక ఇబ్బందులు

ఒక్కో వైద్యుడు 50 మందికిపై రోగులను చూడాల్సి వస్తోంది

మహిళా వైద్యులకు వాష్‌రూమ్స్, కనీస సౌకర్యాల్లేక అవస్థలు

వైద్యులకు పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు సకాలంలో ఇవ్వాలి

ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు, వైద్యుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ డి. జయధీర్‌బాబు అన్నారు. ముఖ్యంగా టెరిషరీ కేర్‌లో కీలకపాత్ర పోషించే బోధనాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యుల సంఖ్య లేకపోవడంతో ప్రస్తుతమున్న వైద్యులపై తీవ్రభారం పడుతోందన్నారు. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ వంటి కీలక విభాగాల్లో ఓపీ రోజుల్లో పరిస్థితి రణరంగాన్ని  తలపిస్తోందన్నారు. ఒక్కో వైద్యుడు ఏకంగా 50 మందికి పైగా రోగులను చూడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త వైద్య పోస్టులను మంజూరుచేయాలని ఆయన కోరారు. ఆరోగ్య శాఖలోని వైద్యుల సమస్యలు, ఇతర అంశాలపై జయధీర్‌ ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

కొత్త యూనిట్‌ల మంజూరే లేదు..   
బోధనాస్పత్రుల్లో కొత్త యూనిట్లను ప్రభుత్వం ఇటీవల ఎప్పుడూ మంజూరు చేయలేదు. పెరుగుతున్న రోగులకు తగ్గట్లుగా పోస్టులు మంజూరు చేయకపోవడంతో వైద్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదా.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం 34 ఆపరేషన్‌ టేబుల్స్‌ పనిచేస్తున్నాయి. ఇక్కడ అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌లు, 18 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పైగా ఇక్కడ పనిచేసే అనస్తీషియా వైద్యులకు వీఐపీ కాన్వాయ్‌ విధులు అదనంగా ఉంటాయి. 

ఓ వైపు రోగుల తాకిడి, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది అసోసియేట్స్, ఐదు ప్రొఫెసర్లు, 12 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం గతంలో ప్రతిపాదనలు నడిచాయి. కానీ, ఇప్పటివరకు అవి ఏమయ్యాయో తెలీదు. ఇక విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో మానసిక, ప్రసూతి, క్యాన్సర్‌ ఆస్పత్రులకు ఒక్కో అనస్తీషియా యూనిట్‌ కావాలని ప్రతిపాదనలున్నాయి. ఇలా అన్ని జీజీహెచ్‌లలోని అన్ని వైద్య విభాగాల్లో కొత్త యూనిట్‌ల కోసం ప్రతిపాదనలు పంపినా అవి ఏమైపోతున్నాయో తెలీడంలేదు. 

డీఎస్‌హెచ్‌ పరిధిలో దారుణం   
డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (డీఎస్‌హెచ్‌) పరిధిలో పరిస్థితులు ఇంకా దారుణం. గైనిక్, పీడియాట్రిక్స్, అనస్తీషియా వంటి విభాగాల్లో ఒక్కో వైద్యుడే అందుబాటులో ఉంటున్నారు. దీంతో.. వాళ్లు సెలవు పెడితే సేవలు నిలిచిపోయే పరిస్థితులున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా వైద్య పోస్టులు మంజూరు చేయాలి. ఇవి పెరిగితేనే ప్రజలకు ఆరోగ్య భద్రత మెరుగుపడుతుంది. 

సకాలంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు   
ఇక వైద్యులకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. అవి ఇస్తున్నామని పైకి చెబుతున్నప్పటికీ సకాలంలో ఇవ్వడంలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డీఎంఈ పరిధిలోని వైద్యులకు ఏడాది నుంచి ఏడాదిన్నర మేర పెండింగ్‌లో ఉన్నాయి. 

రోగుల వాష్‌రూమ్సే దిక్కు..   
ఇంత పనిభారం, ఒత్తిడి మధ్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు ఉండటంలేదు. ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బంది ఎక్కువ శాతం ఉంటారు. ఈ క్రమంలో వారికి వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్‌ రూమ్స్‌ కూడా ఉండవు. రోగులు వాడే మరుగుదొడ్లనే వాళ్లు వాడాల్సి ఉంటుంది. ఉ.9 నుంచి సా.4 గంటల వరకూ కదలకుండా సేవలు అందించాలని మమ్మల్ని ఆదేశిస్తుంటారు. అయితే, ఆస్పత్రుల్లో మాక్కావాల్సిన వసతులను మాత్రం పట్టించుకోరు. అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. 

సీపీసీ అమలుకు కమిటీ వేయాలి..   
యూజీసీ 7వ సెంట్రల్‌ పే కమిషన్‌ (సీపీసీ) అరియర్స్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఉద్యోగ విరమణ పొందాక కూడా అరియర్స్‌ అందకపోవడంతో కొందరు వైద్యులు కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే, కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు కూడా వేయడంలేదు. ఇక యూజీసీ 8వ సీపీసీ కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో టీచింగ్‌ డాక్టర్లకు సీపీసీ అమలుకు రాష్ట్రస్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.

టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు అమలుచేయాలి..
డీఎస్‌హెచ్, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీపీహెచ్‌)ల్లో వైద్యులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ రెండు విభాగాల్లోను టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు (టీబీపీ) అమలుచేయాలి. డీపీహెచ్‌ వైద్యులకు టీబీపీ అమలుచేస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. ఆ ఫైల్‌ ఆర్థిక శాఖలోనే మూలుగుతోంది. ఇన్‌–సర్వీస్‌ పీజీ కోటా విషయంలోనూ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధానాన్ని మెరుగుపరచాలే తప్ప, కుదించడం, పూర్తిగా ఎత్తేయడం మంచిది కాదు. ఇన్‌సర్వీస్‌ కోటాతో ప్రభుత్వంలో ఎక్కువమంది స్పెషలిస్ట్‌లు అందుబాటులోకి వస్తారు. స్టైపెండ్‌ విషయంలో జూనియర్‌ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement