breaking news
jayadheer
-
వైద్యులను పెంచాలి.. పనిభారం తగ్గించాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు, వైద్యుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి. జయధీర్‌బాబు అన్నారు. ముఖ్యంగా టెరిషరీ కేర్‌లో కీలకపాత్ర పోషించే బోధనాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యుల సంఖ్య లేకపోవడంతో ప్రస్తుతమున్న వైద్యులపై తీవ్రభారం పడుతోందన్నారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ వంటి కీలక విభాగాల్లో ఓపీ రోజుల్లో పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోందన్నారు. ఒక్కో వైద్యుడు ఏకంగా 50 మందికి పైగా రోగులను చూడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త వైద్య పోస్టులను మంజూరుచేయాలని ఆయన కోరారు. ఆరోగ్య శాఖలోని వైద్యుల సమస్యలు, ఇతర అంశాలపై జయధీర్ ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కొత్త యూనిట్ల మంజూరే లేదు.. బోధనాస్పత్రుల్లో కొత్త యూనిట్లను ప్రభుత్వం ఇటీవల ఎప్పుడూ మంజూరు చేయలేదు. పెరుగుతున్న రోగులకు తగ్గట్లుగా పోస్టులు మంజూరు చేయకపోవడంతో వైద్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదా.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం 34 ఆపరేషన్ టేబుల్స్ పనిచేస్తున్నాయి. ఇక్కడ అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పైగా ఇక్కడ పనిచేసే అనస్తీషియా వైద్యులకు వీఐపీ కాన్వాయ్ విధులు అదనంగా ఉంటాయి. ఓ వైపు రోగుల తాకిడి, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది అసోసియేట్స్, ఐదు ప్రొఫెసర్లు, 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం గతంలో ప్రతిపాదనలు నడిచాయి. కానీ, ఇప్పటివరకు అవి ఏమయ్యాయో తెలీదు. ఇక విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో మానసిక, ప్రసూతి, క్యాన్సర్ ఆస్పత్రులకు ఒక్కో అనస్తీషియా యూనిట్ కావాలని ప్రతిపాదనలున్నాయి. ఇలా అన్ని జీజీహెచ్‌లలోని అన్ని వైద్య విభాగాల్లో కొత్త యూనిట్ల కోసం ప్రతిపాదనలు పంపినా అవి ఏమైపోతున్నాయో తెలీడంలేదు. డీఎస్‌హెచ్ పరిధిలో దారుణం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలో పరిస్థితులు ఇంకా దారుణం. గైనిక్, పీడియాట్రిక్స్, అనస్తీషియా వంటి విభాగాల్లో ఒక్కో వైద్యుడే అందుబాటులో ఉంటున్నారు. దీంతో.. వాళ్లు సెలవు పెడితే సేవలు నిలిచిపోయే పరిస్థితులున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా వైద్య పోస్టులు మంజూరు చేయాలి. ఇవి పెరిగితేనే ప్రజలకు ఆరోగ్య భద్రత మెరుగుపడుతుంది. సకాలంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు ఇక వైద్యులకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. అవి ఇస్తున్నామని పైకి చెబుతున్నప్పటికీ సకాలంలో ఇవ్వడంలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డీఎంఈ పరిధిలోని వైద్యులకు ఏడాది నుంచి ఏడాదిన్నర మేర పెండింగ్‌లో ఉన్నాయి. రోగుల వాష్రూమ్సే దిక్కు.. ఇంత పనిభారం, ఒత్తిడి మధ్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు ఉండటంలేదు. ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బంది ఎక్కువ శాతం ఉంటారు. ఈ క్రమంలో వారికి వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉండవు. రోగులు వాడే మరుగుదొడ్లనే వాళ్లు వాడాల్సి ఉంటుంది. ఉ.9 నుంచి సా.4 గంటల వరకూ కదలకుండా సేవలు అందించాలని మమ్మల్ని ఆదేశిస్తుంటారు. అయితే, ఆస్పత్రుల్లో మాక్కావాల్సిన వసతులను మాత్రం పట్టించుకోరు. అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. సీపీసీ అమలుకు కమిటీ వేయాలి.. యూజీసీ 7వ సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) అరియర్స్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఉద్యోగ విరమణ పొందాక కూడా అరియర్స్ అందకపోవడంతో కొందరు వైద్యులు కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే, కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు కూడా వేయడంలేదు. ఇక యూజీసీ 8వ సీపీసీ కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో టీచింగ్ డాక్టర్లకు సీపీసీ అమలుకు రాష్ట్రస్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలుచేయాలి..డీఎస్‌హెచ్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)ల్లో వైద్యులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ రెండు విభాగాల్లోను టైమ్ బౌండ్ ప్రమోషన్లు (టీబీపీ) అమలుచేయాలి. డీపీహెచ్ వైద్యులకు టీబీపీ అమలుచేస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. ఆ ఫైల్ ఆర్థిక శాఖలోనే మూలుగుతోంది. ఇన్–సర్వీస్ పీజీ కోటా విషయంలోనూ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధానాన్ని మెరుగుపరచాలే తప్ప, కుదించడం, పూర్తిగా ఎత్తేయడం మంచిది కాదు. ఇన్‌సర్వీస్ కోటాతో ప్రభుత్వంలో ఎక్కువమంది స్పెషలిస్ట్‌లు అందుబాటులోకి వస్తారు. స్టైపెండ్ విషయంలో జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. -
ప్రాచీన హోదాను ఖూనీ చేస్తున్నారు
భాషను పట్టించుకోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు సాహిత్యంపై రాష్ట్ర విభజన ప్రభావం ప్రముఖ కవి ఆచార్య జయధీర్ తిరుమలరావు రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సాహిత్యంపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ కవి, విమర్శకుడు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, పరిశోధనా సంస్థల విశ్రాంత సంచాలకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాఠకులు కూడా వేరయ్యారని చెప్పారు. పురమందిరంలో ఆదివారం నిర్వహించిన సినారె సంస్మరణ సభలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగ సాహిత్యం పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే... ప్రభుత్వాల అసమర్ధతకు పరాకాష్ట కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా... రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఈ హోదాను చంపేస్తున్నాయి. ఈ విషయం చెప్పడానికి మొహమాటం అవసరం లేదు. పరిశోధనలకు నిధులు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో శ్రద్ధ తీసుకోరు. మైసూర్లో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రంలో ఉన్న మన తెలుగు విభాగాన్ని సొంత గడ్డపైకి తెచ్చుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. మన పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఏనాడో తమ తమిళ విభాగాన్ని అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రానికి తీసుకుపోయింది. మన భాషను మనం కాపాడుకోవాలి... అభివృద్ధి చేసుకోవాలి... కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం విచారకరం. విభజన ప్రభావం సుస్పష్టం తెలంగాణ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు ఇక్కడికి చేరడం లేదు. పత్రికలు, ప్రచురణకర్తలు విడిపోయారు. ప్రముఖుల రచనలు మినహాయించి, ఒక ప్రాంతంలో అచ్చయ్యే పుస్తకాలు మరో చోట లభ్యం కావడం లేదు. అటు తెలంగాణలో నవకేతన్, నవ తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు చాలా వరకూ ఆయా ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. సినారె అందరి వాడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్ధివ శరీరం వద్ద ఆ రోజు ఉదయం నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మరి కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నారు. మహాకవి అంతిమ ప్రస్థానంలో రాజకీయాలు చూడొద్దు. సినారె అందరి వాడు. ఆయనకు అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్నారు. పూర్వ వైభవం సంతరించుకోవాలంటే... నేను బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యపీఠానికి ఇన్చార్జి డీన్‌గా పనిచేశాను. ఈ రోజున సాహిత్యపీఠం పూర్వవైభవం తిరిగి సంతరించుకోవాలంటే గట్టి రాజకీయ సంకల్పం కావాలి. ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం కావాలి. అవి తగిన స్థాయిలో వ్యక్తం కావడంలేదు. కొన్ని సంస్థలు ఉమ్మడి జాబితాలో ఉంటేనే మేలు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం పరిశోధనా సంస్థ వంటివి ఉమ్మడి జాబితాలో ఉంటేనే భాషాసాహిత్యాలకు మేలు జరుగుతుంది. ఈ సంస్థ నిర్వహించే తాళపత్రాల సేకరణ, అధ్యయనం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా జరిగితే మంచిది. ఈ విషయంలో వేరుకుంపట్లు అనవసరం.


