కేటీఆర్‌,హరీష్‌ రావు విడుదల.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం | KTR and Harish Rao spoke to the media after their release from jail | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌,హరీష్‌ రావు విడుదల.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం

Sep 8 2026 4:54 PM | Updated on Sep 8 2026 5:43 PM

KTR and Harish Rao spoke to the media after their release from jail

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గుండాలను కేసీఆర్‌ ఇంటి మీదకు పంపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బోయిన్‌పల్లి పీఎస్‌ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేల మీద హేయంగా దాడి చేశారని అందరి కంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్‌ పార్టీకేనని 600కు పైగా హామీలిచ్చి వెయ్యిరోజులైనా ఇంకా వాటిని నేరవేర్చలేదని..స్కూటీలు ఇస్తానని లూటీలు చేశారని రేవంత్‌ సర్కారుపై  ధ్వజమెత్తారు. దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్‌ నెరవేర్చారని ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా  నిలబెట్టారని కొనియాడారు. 

అనంతరం జవహర్‌ నగర్‌ పీఎస్‌ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌ రావు మాట్లాడారు.  సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ చేసే దమనకాండను రాష్ట్ర ప్రజలంగా గమనిస్తున్నారన్నారు.  డైవర్షన్‌ పాలిటిక్స్‌తో హెడ్‌ లైన్స్‌ మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారవని చెప్పారు.  

హరీష్ రావు మాట్లాడుతూ.."తెలంగాణలో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. యూరియా యాప్‌లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నయాపైసా ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. సబితక్క గొంతు మీద మగ పోలీసు చేయి వేసి నొక్కారు అసెంబ్లీ గౌరవ సభను రేవంత్ కౌరవసభగా మార్చారు." అన్నారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.

ఏం జరిగింది?
కేసీఆర్‌ ఇంటి ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్‌ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్‌ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు.  

ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్‌, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ  శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ని బోయన్‌ పల్లి, హరీష్‌ రావును జవహర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. కాసేపటి క్రితమే వారిద్దరిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు మీడియా ఎదుట మాట్లాడారు. 

ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌, హరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement