సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందన్న ఆయన.. పోలీసులే దగ్గరుండి కాంగ్రెస్ గుండాలని పంపుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇంటి ముట్టికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు.
ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


