తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఎర్రవల్లిలోని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలిరావడంతో వాతావరణం మరింత హీటెక్కింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.
చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగడంతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్, తాతా మధు చిత్ర పటాలకు చెప్పుల దండలు వేసి నిరసన తెల్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పార్టీల నిరసనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో ట్రాఫిక్ జామ్
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ కేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వరదరాజ్‌పూర్‌లో పరస్పర దాడులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటీపోటా నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ దగ్ధం చేయగా, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకున్నాయి. చెప్పులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
జమ్మికుంటలో తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ బైక్ ర్యాలీ
తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో అసెంబ్లీ వద్ద వ్యవహరించిన తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి.
చదవండి: ఎర్రవల్లిలో టెన్షన్.. టెన్షన్
ఐలయ్య నివాసం వద్ద డప్పు కొట్టిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావుడప్పు కొడతానన్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆయన నివాసం వద్ద డప్పులు కొట్టి నిరసన తెలిపారు. బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులపై అనుచిత ప్రవర్తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రోడుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగి, ట్రాఫిక్ స్తంభించింది.
ఇదీ చదవండి: 'కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే'
తాతా మధును బర్తరఫ్ చేయాలి
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గంప గోవర్ధన్ అరెస్ట్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే కమాన్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేవరకొండలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
బీఆర్ఎస్ అధినేత పోకడలను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలూ నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యారని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న సైకో రేవంత్! 😡
🚨 రేవంత్ రెడ్డి ఆదేశాలతో..
కాంగ్రెస్ గూండాలకు బందోబస్తు ఇస్తూ ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఇంటి మీద దాడికి తీసుకెళ్తున్న పోలీసులు!
శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం, హోం మంత్రి.. రేవంత్ రెడ్డి స్వయంగా దాడులను ప్రోత్సహిస్తావా?
ఇదేనా… pic.twitter.com/sO60gB1SWP— BRS Party (@BRSparty) September 8, 2026


