‘టెట్‌ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ | YSRCP MLC Chandrasekhar Reddy Slams AP Govt | Sakshi
Sakshi News home page

‘టెట్‌ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’

Sep 8 2026 4:23 PM | Updated on Sep 8 2026 5:03 PM

YSRCP MLC Chandrasekhar Reddy Slams AP Govt

తాడేపల్లి:  డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై 3.30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నెల నుంచే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని,  ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మోసాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముందుకు నెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పోర్ట్స్‌ కోటా అక్రమాలలో శాప్‌ పాత్ర ఉందని, అధికారుల ప్రెస్‌మీట్‌లో మీడియాను బెదిరించినట్లు ఉందన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌ రెడ్డి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డీఎస్సీ కన్వీనర్, శాప్ చైర్మన్ చేసిన తప్పులను అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపి తప్పులను తేల్చాల్సిన రోజు అధికారులకు వస్తుంది. స్పోర్ట్స్ డీఎస్సీ, మెగా డీఎస్సీల్లో టెట్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈడిగ ప్రభాకర్‌కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే ఒప్పుకున్నా, 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా అబద్ధపు ప్రచారం చేశారు.  

ఎస్జీటీ పోస్టుకు పేపర్ వన్-ఏ అవసరమైతే, స్పెషల్ స్కూల్స్‌కు వర్తించే పేపర్ టు-బి మార్కులను చూపించి కమిషనర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ పరిశీలిస్తే ఎక్కడా ప్రభాకర్‌కు పేపర్ టు-బి రాసిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత 2025లో జరిగిన టెట్ పరీక్షను ప్రభాకర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలి. 

జే ఉషా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు ఏకంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు కేటాయించారు.  2017 తర్వాత లాంగ్వేజ్‌లకు ప్రత్యేకంగా టెట్ పాస్ కావాలన్న నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఉషాకు పోస్టు ఇచ్చారు. రాజ్ కుమార్  అనే వ్యక్తికి అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. 

తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాకు, అభ్యర్థులకు వార్నింగులు ఇస్తూ అక్రమ కేసులు పెడతామని శాప్ ఎండీ బెదిరిస్తున్నారు.  జూడో క్రీడలో జరిగిన ఘోరమైన అవకతవకలను రెండు అసోసియేషన్ల మధ్య గొడవగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తున్నారు. 2025 సెప్టెంబర్‌లోనే రిక్రూట్‌మెంట్ ముగిస్తే, 2026 జూన్‌లో వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికెట్లను అక్రమంగా మార్చేశారు.  పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్‌తో ఉద్యోగం ఇచ్చిన విషయం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బట్టబయలైంది.

ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా అధికారులు నిస్సిగ్గుగా ట్యాంపరింగ్ చేశారు.  ఎమ్మెల్యే పూనా రవికుమార్ సంతకాలతో ఇచ్చిన సర్టిఫికెట్లను చెల్లుబాటు చేయడానికి నకిలీ ఆథరైజేషన్ లెటర్లను సృష్టిస్తున్నారు.  జీవో నెంబర్ 4, 47 ప్రకారం సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే సంతకం చేయాలన్న రూల్ ఉంటే గౌరవ అధ్యక్షుడి సంతకాలను ఎలా ఆమోదిస్తారు.  2018 నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ పర్సన్లకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్‌కు 20 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చే నిబంధనను ఎందుకు రద్దు చేశారు. 

జిల్లా స్థాయిలో డీఎస్‌డీవోల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే పద్ధతిని పూర్తిగా తొలగించి శాప్‌లో కూర్చుని అక్రమాలకు పాల్పడ్డారు.  కలెక్టర్లు, డీఈవోల ఆధ్వర్యంలో జరగాల్సిన 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిగా ఎత్తేసి నియామక పత్రాలు ఇచ్చారు.  అభ్యర్థులు పెట్టుకున్న గ్రీవెన్స్‌లను కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.  కోర్టు ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అర్హులకు న్యాయం చేయకుండా తొక్కిపెట్టింది.  కోర్టు ఆదేశాలు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా తీసుకొస్తాం, గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ ప్రశ్నించారు.

డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement