సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఆటోమేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో కేవలం ఫ్యాక్టరీ ఉద్యోగాలనే కాకుండా, నైపుణ్యంపై ఆధారపడే సంప్రదాయ వృత్తులను కూడా ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ ఉదంతం తెలియజేస్తోంది.
ఓ క్షురకుడు (బార్బర్) తన పనిని చేస్తుండగా, అతడి కదలికలను రికార్డ్ చేసి విశ్లేషించేలా ఒక హైటెక్ సెటప్‌ను అమర్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సదరు యువకుడు క్షవరం చేస్తున్నప్పుడు అతని చేతుల కదలికలు, టైమింగ్, కచ్చితత్వాన్ని ఏఐకు శిక్షణ ఇచ్చే డేటాగా సేకరిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
ఈ వీడియోను షేర్ చేస్తూ..దేశంలో ఏఐ శిక్షణ జరుగుతోంది! రాబోయే రోజుల్లో క్షురకుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు’అని హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఆ వీడియో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్షవరం చేసే సమయంలో రోబోట్లకు ముఖంపై బ్లేడ్లు అప్పగించడం ప్రమాదకరమని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. స్థానిక క్షురకుల అనుభవం, వారి మనుషుల మధ్య ఉండే సంభాషణలు, హస్తకళ నైపుణ్యాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ ప్రమేయం లేని సేవలు పెరిగే అవకాశం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు అంటున్నారు.
గతంలో మెహందీ పెట్టే యంత్రాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసి మరికొన్ని ఉద్యోగాలు మాయం అంటూ గోయంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షేవింగ్ ఏఐ వీడియో టెక్నాలజీ భవిష్యత్తుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
AI training going on India ! Even barbers job may soon be at risk 🙈 pic.twitter.com/99CAwj5m2h
— Harsh Goenka (@hvgoenka) September 14, 2026


