ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్‌ భయం నిజమేనా? | AI Slowdown vs China Race: Who Is Right Trump or Tech Leaders | Sakshi
Sakshi News home page

ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్‌ భయం నిజమేనా?

Sep 14 2026 11:02 AM | Updated on Sep 14 2026 11:37 AM

AI Slowdown vs China Race: Who Is Right Trump or Tech Leaders

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్‌ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్‌?..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్‌ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్‌ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?

టెక్‌ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..
ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్‌(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.

ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్‌ చెబుతున్న ‘పేసింగ్‌’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్‌, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్‌ రెండూ ఉండాలన్నమాట.

ఆందోళనలో ట్రంప్‌ 
ట్రంప్‌ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్‌ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.

చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?
ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్‌ పెట్టుబడులు, అధునాతన చిప్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్‌ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.

అసలు భయం ఏంటంటే..
ఆల్ట్‌మన్‌ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్‌’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్‌ హెచ్చరించారు.

ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!

ఏఐ అభివృద్ధి వేగంపై టెక్‌ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్‌ సోర్స్‌ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

మరి ఎవరి వాదన కరెక్ట్‌?
నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్‌ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.

అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.

ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్‌.. అయోమయంలో ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement