చేయి దాటితే మానవాళిని అంతం చేస్తుంది
నియంత్రించకపోతే దశాబ్దంలోగా మన మనుగడను హరించేస్తుంది
ఏడాదిలోగా ఇంటర్నెట్‌ను అది వశపర్చుకుంటుంది
ఏఐ వ్యవస్థల్లో స్వీయ సామర్థ్యం పెరుగుతోంది.. ఇది ప్రమాదకరం
ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ ఆందోళన
ఏఐ వేగానికి కళ్లెం వేయాల్సిందేనని స్పష్టీకరణ
ఏఐ గమనాన్ని కనిపెట్టేలా భద్రతా వ్యవస్థ మెరుగుపరచాలని సూచన
ఆమోడెయ్ అభిప్రాయంతో ఏకీభవించిన ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్
న్యూయార్క్/సాక్షి, హైదరాబాద్: అనూహ్య వేగంతో సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్న కృత్రిమ మేథ (ఏఐ)కు కళ్లెం వేయాల్సిన సమయమొచ్చిందని కృత్రిమ మేథ (ఏఐ) దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ వ్యాఖ్యానించారు. ఫార్చూన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో పలు ఆందోళకర అంశాలను పంచుకున్నారు. ‘‘ఏఐ అమితమైన వేగంతో శక్తిసామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలోగా యావత్ మానవాళిని ఇది హరించేస్తుంది. ఇప్పటికైనా ఏఐ నిపుణులు, ప్రభుత్వాలు, పౌరసమాజం మేల్కొని ఏఐకు కళ్లెం వేయాలి.
భద్రతా ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలి’’ అని అన్నారు. ఏఐను నియంత్రించపోతే అది మనందర్నీ చంపేస్తుందని ఆంథ్రోపిక్ నుంచి వైదొలగిన ఏఐ శాస్త్రవేత్త జాకబ్ కోక్సన్ ఇటీవల వ్యాఖ్యానించిన వేళ అదే తరహాలో డారియో ఆమోడెయ్ మాట్లాడటం గమనార్హం. ‘‘ఎప్పటికప్పుడు ఏఐ సరైన మార్గంలో వెళ్తుందో లేదో ఓ కంట కనిపెట్టే భద్రతావ్యవస్థను మెరుగుపరచాలి. లేదంటే మానవాళికి ముప్పు తప్పదు.
ఏఐలో వస్తున్న పెను మార్పులను అడ్డుకోకపోతే వచ్చే 12 నెలల్లోగా యావత్ ప్రపంచ ఇంటర్నెట్‌ను అది గుప్పిటపట్టేస్తుంది. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదం’ అని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను అడ్డుకోవడం అంటే దానిని పూర్తిగా నిలిపేయడంకాదు. ఏఐలో సేఫ్టీ రీసెర్చ్, టెస్టింగ్, పర్యవేక్షణ ఖచ్చితంగా మెరుగుపడాలి. శాస్త్రవేత్తలు అర్థంచేసుకోలేనంత స్థాయికి ఏఐ తనకుతానుగా వృద్ధి చెందకుండా అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు.
వంతపాడిన మస్క్, ఆల్ట్‌మన్
డారియో అభిప్రాయంతో ఏఐ దిగ్గజ సంస్థల చీఫ్‌లు సైతం ఏకీభవించారు. సూపర్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లతో ప్రమాదం పొంచి ఉందని ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘ఏఐ అనేది మన చేతి దాటిపోతే అదుపుచేయడం చాలా కష్టం. అప్పుడు దుర్వినియోగం అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. క్షిపణుల తయారీ, జీవఆయుధాలు, సైబర్ దాడులు వంటి రహస్యాలన్నీ ఉగ్రసంస్థలు, హ్యాకర్ల చేతికొచ్చే ప్రమాదముంది. అప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డెవలప్ తరహాలో ఇతరులకూ ఏఐను అడ్డుకునే అవకాశం ఉండాలి’’ అని ఆల్ట్‌మన్, మస్క్ వ్యాఖ్యానించారు.
ఏఐ భద్రతా పరిశోధకుల మాట ఇదీ..
ఏఐ శక్తిసామర్థ్యాలు పెరిగితే అది మానవాళిని నేరుగా నాశనం చేసే అవకాశం ఉండదని ఏఐ భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. అయితే మానవ ప్రయోజనాలకు అనుగుణంగా లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మానవుల కంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏఐ వ్యవస్థలు సిస్టమ్‌లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బయో వెపన్లు, సైబర్ దాడులతో పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలనుకొనే వారికి ఏఐ వ్యవస్థలు సాంకేతికంగా కొంత మేర దోహదపడే ప్రమాదం ఉందంటున్నారు.


