సర్–2002 ఓటు వివరాలిచ్చినా అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా నోటీసులు
మళ్లీ మ్యాపింగ్‌కు చాన్స్ లేక విచారణకు వెళ్లక తప్పని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు.. సర్–2002 ఓటర్ల జాబితాలోని తమ/తమ బంధువుల ఓటు వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది..ఆపై వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం పదేపదే పేర్కొంది. ‘సర్’రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సైతం ఇదే హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 జాబితాలోని వివరాలు ఇచ్చినా, పెద్ద సంఖ్యలో ఓటర్లను అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ చేసుకునే అవకాశం లేదని బీఎల్‌ఓలు చెప్పడంతో ఓటర్లు విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్–2026లో భాగంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లు ఉండగా, వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది.
నిర్లక్ష్యమా...లేకపోతే...
చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలు ఇవ్వకపోవడతో వారిని అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా, ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. చాలామంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 ఓటు వివరాలను ఇచ్చినా వారిని అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటిసులిస్తుండడంతో ‘సర్’ప్రక్రియలో తీవ్ర లోపాలను ఎత్తిచూపుతోంది. ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేరును సర్–2002 ఓటర్ల జాబితాలోని పేరుతో అనుసంధానం (మ్యాపింగ్) చేయాల్సి ఉండగా, పెద్ద సంఖ్యలో ఓటర్లను మ్యాపింగ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో సర్–2026 ప్రక్రియ ప్రారంభానికి కొన్ని నెలల ముందే..ముందస్తు సన్నాహకంగా మ్యాపింగ్ ప్రక్రియను ఈసీ చేపట్టగా, తమ పేర్లను మ్యాపింగ్ చేయాలని అప్పట్లోనే స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వో)కు చాలామంది ఓటర్లు అందజేశారు. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారంలో సైతం సర్–2002 జాబితాలోని వివరాలను అందజేశారు. అయినా, తమను అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి ఈసీ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారని సామాజిక మాధ్యమాల వేదిక ఓటర్లు ఆరోపిస్తున్నారు. బీఎల్‌ఓలు/ బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు/ఈఆర్వోల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందా? లేక సాఫ్ట్‌వేర్ లోపాలతో జరిగిందా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని చింతల్‌కుంటలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఓటర్లుండగా, వారిలో చాలామంది ఓటర్లు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. వివరాలిచ్చినా బీఎల్‌ఓల నిర్లక్ష్యంతో మ్యాపింగ్ జరగని ఓటర్ల మ్యాపింగ్‌కు మరో అవకాశం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు.


