తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి? | New in-charge for Telangana Congress | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి?

Sep 14 2026 2:14 AM | Updated on Sep 14 2026 2:14 AM

New in-charge for Telangana Congress

ఉన్నత చదువుల కోసం విదేశాలకు మీనాక్షి నటరాజన్‌ 

10 నెలల పాటు పార్టీ బాధ్యతలకు విరామం  

కొత్త ఇన్‌చార్జి కోసం కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు  

రేసులో ముకుల్‌ వాస్నిక్, శక్తిసిన్హ్‌ గోహిల్, దిగ్విజయ్, గెహ్లాట్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్‌చార్జి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్‌చార్జిని నియమించే దిశగా అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. దీపా దాస్‌మున్షీ స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్‌ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె విదేశాలకు వెళ్లనుండటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే సీనియర్‌ నేతకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నామినేటెడ్‌ పదవులకు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా, ఇతర సంస్థాగత అంశాలతో క్షేత్రస్థాయి నివేదికను మీనాక్షి పార్టీ అధిష్టానానికి సమర్పించారని సమాచారం. అయితే ఆమె గైర్హాజరుతో పార్టీ కొత్త ఇన్‌చార్జి కోసం పలువురు సీనియర్‌ నాయకుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. ప్రధానంగా ముకుల్‌ వాస్నిక్, శక్తిసిన్హ్‌ గోహిల్‌ పేర్లు రేసులో ముందున్నట్లు సమాచారం కాగా, వీరితో పాటు సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్, అశోక్‌ గెహ్లాట్‌ పేర్లను కూడా ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు.  

సంస్థాగత అనుభవశీలి ముకుల్‌ వాస్నిక్‌ 
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ముకుల్‌ వాస్నిక్‌ పేరు ఇన్‌చార్జి రేసులో బలంగా వినిపిస్తోంది. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ వంటి అనేక రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా విజయవంతంగా పనిచేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న వాస్నిక్, పారీ్టలో వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాది రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటం, నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడంలో నేర్పరి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. 

వ్యూహాల రూపకల్పనలో శక్తిసిన్హ్‌ గోహిల్‌ 
గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్‌ గోహిల్‌ పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన గోహిల్‌కు చట్టసభలు, రాజ్యాంగపరమైన అంశాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో గుజరాత్‌ ప్రభుత్వంలో ఆర్థిక, విద్యా శాఖల మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఢిల్లీ, బిహార్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో, క్షేత్రస్థాయి శ్రేణులను సమన్వయం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.  
రాష్ట్ర పరిస్థితులపై దిగ్విజయ్‌కు పట్టు 
రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని మెజారిటీ సీనియర్‌ నాయకులతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కావడంతో ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆయన 1993 నుంచి 2003 వరకు పదేళ్ల పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఉన్నారు.  

సమన్వయకర్తగా అశోక్‌ గెహ్లాట్‌ 
రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌.. రాజస్థాన్‌ రాష్ట్రానికి మూడు సార్లు (1998–2003, 2008–2013, 2018–2023) ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత. గతంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత వ్యవహారాలు) పనిచేసిన కాలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో పార్టీని నడిపించగల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం సాధించేందుకు గెహ్లాట్‌ లాంటి సీనియర్‌ నేత అవసరం ఉంటుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. కాగా కొత్త ఇన్‌చార్జి ఎంపికపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్‌ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై త్వరలో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement