రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి రైల్వే వ్యవస్థపై దాడి కలకలం రేపింది. ఉక్రెయిన్–పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని యాహోడిన్ ప్రాంతంలో ఓ రైలుపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను ముందుగానే రైలు నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు యూరప్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అదే రైల్వే మార్గంలో మరో రైలులో ప్రయాణించినట్లు సమాచారం. కీవ్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
రష్యా మాత్రం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ‘రైల్వే మౌలిక వసతుల’పై దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్‌జలిజ్‌నిట్సియా మాత్రం దాడికి గురైన డ్రోన్ లక్ష్యం దౌత్య ప్రతినిధులు ప్రయాణించిన రైలు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. రష్యా దాడుల ముప్పు నేపథ్యంలో టైమ్‌టేబుల్‌లో మార్పులు చేసి దౌత్య రైలును ముందుగానే స్టేషన్ నుంచి పంపించినట్లు తెలిపింది.
దాడికి గురైన రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయాలని ఆదేశం ఇచ్చిన కేవలం 15 నిమిషాలకే రష్యా జెట్ ప్రొపెల్డ్ డ్రోన్ దాడి చేసినట్లు ఉక్రెయిన్ రైల్వే అధికారులు తెలిపారు. అదే సమయంలో మాజీ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ మరో రైలులో యాహోడిన్ స్టేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ దాడి పోలాండ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని ఉక్రెయిన్, పోలాండ్ అధికారులు తెలిపారు.
కీవ్ సమావేశానికి హాజరైన మాజీ స్వీడన్ ప్రధాని కార్ల్ బిల్డ్ కూడా తన రైలులో ప్రయాణికులను ముందుగా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులో ఉందని సమాచారం రావడంతో ప్రయాణాన్ని కొనసాగించామని తెలిపారు. ఆయన ప్రయాణించిన రైలు సురక్షితంగా పోలాండ్ సరిహద్దులోని డోరోహుస్క్ స్టేషన్‌కు చేరుకుంది. అయితే బిల్డ్ బోరిస్ జాన్సన్‌తోనే ప్రయాణించారా అనే విషయాన్ని జాన్సన్ ధ్రువీకరించలేదు.
ఈ దాడిపై బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. పోలాండ్ సరిహద్దు వద్ద నిలిపి ఉంచిన ఉక్రెయిన్ రైలు ఇంజిన్‌పై రష్యా ఎందుకు దాడి చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అర్థరహిత దాడులకు ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్‌కు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థలను మిత్రదేశాలు అత్యవసరంగా అందించాలని ఆయన కోరారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో రైళ్లు, రైల్వే డిపోలు, పెట్రోల్ స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాలు లక్ష్యంగా మారుతున్నాయని సమాచారం. ఇటీవల ఉక్రెయిన్–మాల్డోవా సరిహద్దు వద్ద రష్యా డ్రోన్ దాడిలో ఇద్దరు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై జరిగిన మరో డ్రోన్ దాడిలో మహిళా కండక్టర్ మృతి చెందారు. ఈ నెల ప్రారంభంలో కీవ్‌లోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఆరుగురు రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌లో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రజలకు రైలు ప్రయాణమే ప్రధాన రవాణా మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థపై జరుగుతున్న వరుస దాడులు ఆ దేశ ప్రజలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు యూరప్‌లోనూ అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటుండటంతో రష్యా చర్యలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


