ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు! | AI Dark Side China Spy Chief Warns of Political Chaos Cyber Attacks | Sakshi
Sakshi News home page

ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ఊహించని ముప్పు!

Sep 14 2026 10:30 AM | Updated on Sep 14 2026 10:31 AM

AI Dark Side China Spy Chief Warns of Political Chaos Cyber Attacks

కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందని చైనా దేశ భద్రతా శాఖ (స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐ సామర్థ్యాలు పెరగడం వల్ల రాజకీయ స్థిరత్వానికి, క్లిష్టమైన డిజిటల్ మౌలిక వసతులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని చైనా భద్రతా శాఖ మంత్రి చెన్ ఇక్సిన్ హెచ్చరించారు. ‘చైనా సైబర్ స్పేస్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఆయన ఈ అంశాన్ని విశ్లేషించారు.

ప్రధాన హెచ్చరికలు.. ముప్పు అంశాలు

అధునాతన ఏఐ మోడళ్ల ఆధారంగా శత్రు మూలాలు దాడుల వ్యయాన్ని, సాంకేతిక సంక్లిష్టతను తగ్గించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయంగా అస్థిరతను సృష్టించడానికి ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డిస్‌ఇన్ఫర్మేషన్ (వదంతుల) ప్రచారాన్ని శత్రు మూలాలు పెద్దఎత్తున ఉపయోగించే అవకాశముందని స్పష్టం చేశారు. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక సర్వర్ల వంటి కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఏఐ ఏజెంట్లలో ఉన్న నిర్మాణ లోపాల వల్ల రిమోట్ పరికరాల నియంత్రణ శత్రువుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా సున్నితమైన ప్రభుత్వ, వాణిజ్య సమాచారం లీక్ అయ్యే అవకాశముందని తెలిపారు.

అంతర్జాతీయ పోటీ.. గ్లోబల్ గవర్నెన్స్ అవసరం

ప్రస్తుతం ఏఐ సాంకేతికత ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక వ్యూహాత్మక పోటీ వేదికగా మారిందని చైనా పేర్కొంది. కొన్ని సాంకేతికాధిపత్య దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలను, అంతర్జాతీయ ప్రామాణికాలను ఏకపక్షంగా నియంత్రించాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికా విధానాలపై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి పారదర్శకమైన, న్యాయమైన అంతర్జాతీయ నియమావళి ఏర్పాటు కావాలని, ముందస్తు ప్రమాద గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని చైనా పిలుపునిచ్చింది. ఒకవైపు ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా, మరోవైపు అదే ఏఐ వల్ల తమ రాజకీయ వ్యవస్థకు, భద్రతకు ఎదురయ్యే ముప్పును గుర్తించి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి: పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement