నేటి డిజిటల్ యుగంలో బడ్జెట్ నిర్వహణ నుంచి పోర్ట్‌ఫోలియో ప్లానింగ్ వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఉచితంగా, నిమిషాల్లో సలహాలు లభిస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే, మన కష్టార్జితాన్ని నిర్వహించే విషయంలో ఏఐపై గుడ్డిగా ఆధారపడటం ప్రమాదకరమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ ఎక్కడ ఉపయోగపడుతుంది?
ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవడానికి ఏఐ అద్భుతమైన సాధనం. ప్రాథమిక ఆర్థిక సూత్రాలు అర్థం చేసుకోవడం, ప్రతి నెలా అవుతున్న ఖర్చులను విశ్లేషించడం, బడ్జెటింగ్ డ్రాఫ్ట్‌లు తయారు చేయడం, ప్రాథమిక పెట్టుబడి వ్యూహాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఏఐ సాధనాలు చక్కగా ఉపయోగపడతాయి.
ఎక్కడ సరిహద్దు గీసుకోవాలి?
ఏఐ మోడళ్లు గణాంకాలు, డేటా ఆధారంగా నడుస్తాయి తప్ప, మనుషుల మానసిక భావోద్వేగాలు, జీవిత లక్ష్యాలు లేదా అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక అత్యవసర పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేవు. కాబట్టి పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఏఐని గుడ్డిగా నమ్మేలేం.
ఏఐ కొన్నిసార్లు లేని సమాచారాన్ని చాలా ధీమాగా, నిజమని నమ్మించేలా చెప్తుంది (దీనినే హెల్యూసినేషన్ అంటారు). పన్ను లెక్కింపులు లేదా నిర్దిష్ట ఫండ్ల ఎంపికలో ఇది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది.
గుర్తింపు పొందిన మానవ ఫైనాన్షియల్ అడ్వైజర్లు చట్టబద్ధంగా మీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏఐ సాధనాలకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత ఉండదు.
మీ బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్ లేదా వ్యక్తిగత పన్ను వివరాలను ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల్లో అప్‌లోడ్ చేయడం వల్ల సైబర్ భద్రత, గోప్యతా సమస్యలు తలెత్తవచ్చు.
ఏఐని నిపుణుడైన ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని ప్రాథమిక పరిశోధన, ప్రశ్నలు సిద్ధం చేసుకునే అసిస్టెంట్‌గా మాత్రమే ఉపయోగించాలి. తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంక్లిష్టమైన పన్ను ప్రణాళికలు లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవడమే సురక్షితమైన మార్గం.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!


