అపరిమిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్!
నిత్యం విమానాల్లో ప్రయాణించే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ‘పైసాబజార్’ తీపి కబురు అందించింది. ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ‘పీబీ పాస్’ను ఆవిష్కరించింది. పైసాబజార్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వినియోగదారులకు ఏడాది పాటు అపరిమిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
కార్డు పొందిన వినియోగదారులు పైసాబజార్ యాప్ ద్వారా తమ మొదటి చెల్లింపును పూర్తి చేయగానే ఈ కాంప్లిమెంటరీ పాస్ అన్‌లాక్ అవుతుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'కాలిన్సన్' భాగస్వామ్యంతో, 'లాంజ్‌కీ' సహకారంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పాస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 800 పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 1,800కు పైగా లగ్జరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఉపయోగించుకోవచ్చు.
ఈ సందర్భంగా పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యం. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎక్కువగా కోరుకునేది ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్. సాధారణంగా కార్డులపై ఉండే ఖర్చుల పరిమితులు, విజిట్ల లెక్కింపులతో సంబంధం లేకుండా అపరిమిత యాక్సెస్ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!


