ఒక్క రోజులో మారిపోతున్న రూల్స్‌.. | New Rules From September 1 LPG Car Prices ITR Airport Rule Changes | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో మారిపోతున్న రూల్స్‌..

Aug 31 2026 9:04 AM | Updated on Aug 31 2026 10:03 AM

New Rules From September 1 LPG Car Prices ITR Airport Rule Changes

ఆగస్ట్‌ నెల ముగుస్తోంది.. సెప్టెంబర్‌ నెల ప్రారంభమవుతోంది. కొత్త నెల ప్రారంభంతోనే కొన్ని ధరలు మారడం, మరికొన్ని నిబంధనలు అమల్లోకి రావడం సాధారణమే. అయితే ఈసారి సెప్టెంబర్‌ 1 నుంచి సామాన్యుల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వంటగ్యాస్‌ నుంచి కార్ల ధరలు, ఆదాయపు పన్ను రిటర్నులు, అంతర్జాతీయ విమాన ప్రయాణం వరకు కీలక పరిణామాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుండగా.. మరికొన్ని ఆగస్టు 31తో గడువు ముగుస్తున్న అంశాలు. అవేంటో చూద్దాం..

ఎల్‌పీజీ ధరల్లో మార్పు

దేశంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ ధరలను సమీక్షిస్తాయి. దీంతో సెప్టెంబర్‌ 1న కూడా 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌, 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరల్లో మార్పు ఉంటుందా అనే దానిపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో గృహ ఎల్‌పీజీ ధరల్లో మార్పు లేకపోగా, వాణిజ్య సిలిండర్‌ ధరను కంపెనీలు తగ్గించాయి. ఉదాహరణకు ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ రూ.942గా, 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ రూ.2,738గా ఉంది. సెప్టెంబర్‌ ధరలను చమురు కంపెనీలు నిర్ణయించాల్సి ఉంది.

ఎల్‌పీజీ ఈ-కేవైసీ గడువు

గృహ ఎల్‌పీజీ వినియోగదారులకు ఆగస్టు 31 కీలక తేదీ. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు గడువులోపు ప్రక్రియను పూర్తి చేయకపోతే గ్యాస్‌ రీఫిల్‌ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చమురు మార్కెటింగ్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కనెక్షన్‌ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా సబ్సిడీ/దేశీయ ధర ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

కారు కొనాలనుకునేవారికి షాక్‌

సెప్టెంబర్‌ 1 నుంచి టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచనుంది. కార్లు, ఎస్‌యూవీలపై మోడల్‌, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ పెంపు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్‌ కార్లకూ వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కొంతవరకు భర్తీ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

మరోవైపు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కూడా సెప్టెంబర్‌ నుంచి తన మొత్తం వాహన శ్రేణిపై గరిష్ఠంగా 1 శాతం ధర పెంచనుంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపు మారుతుంది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు, భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. ఇది 2026లో హ్యుందాయ్‌ చేపడుతున్న మూడో ధర సవరణగా నిలుస్తోంది.

విదేశాలకు వెళ్లేవారికి ఊరట

సెప్టెంబర్‌ 1 నుంచి భారత్‌ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్ద బోర్డింగ్‌ పాస్‌పై ప్రత్యేకంగా స్టాంప్‌ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ డిజిటల్‌ బోర్డింగ్‌ పాస్‌ లేదా ప్రింటెడ్‌ కాపీని చూపించి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ మార్పు విమానాశ్రయాల్లో కాగితపు ప్రక్రియను తగ్గించి, ప్రయాణికులకు వేగవంతమైన ఇమ్మిగ్రేషన్‌ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఉంది.

ఆదాయపు పన్ను రిటర్న్‌ కీలక గడువు

సెప్టెంబర్‌ 1కి ముందు పూర్తి చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఉంది. 2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు ఐటీఆర్‌-4 దాఖలు చేయాల్సిన వారికి ఆగస్టు 31 గడువుగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న, ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ నిబంధనల కింద అర్హత పొందిన వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, కొన్ని సంస్థలకు ఐటీఆర్‌-4 వర్తిస్తుంది. గడువును మిస్‌ చేస్తే ఆలస్య రుసుము, వడ్డీ వంటి పరిణామాలు ఉండొచ్చు.

ఏటీఎఫ్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు

ఎల్‌పీజీతో పాటు ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ధరలను కూడా చమురు కంపెనీలు సాధారణంగా నెల ప్రారంభంలో సమీక్షిస్తాయి. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మాత్రం ఆయా నగరాల్లోని సరఫరాదారులు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు. కాబట్టి సెప్టెంబర్‌ ప్రారంభంలో ఇంధన ధరల తాజా ప్రకటనలను గమనించడం అవసరం. ఏటీఎఫ్‌ ధరల్లో మార్పులు విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పరోక్షంగా విమాన టికెట్‌ ధరలపైనా ప్రభావం ఉండొచ్చు.

ఇదీ చదవండి: పిల్లల భవితకు ఆర్థిక పునాది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement