Income Tax: రిటర్నులు వేశాక ఏం చేయాలి.. | ITR filing after submission FY 2025-26 Verification Refund Revised return | Sakshi
Sakshi News home page

Income Tax: రిటర్నులు వేశాక ఏం చేయాలి..

Aug 24 2026 11:57 AM | Updated on Aug 24 2026 12:06 PM

ITR filing after submission FY 2025-26 Verification Refund Revised return

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2026 జూలై 31 గడువు లోపలే ఆదాయపు పన్ను రిటర్నులు వేసినందుకు సంతోషం. ఒక పెద్ద పని అయిపోయింది. నిజమే..ఒక పెద్ద బాధ్యత నెరవేర్చినట్లే. అయితే, ‘‘ఇల్లు అలకగానే పండుగ కాదు’’ అనే పాతకాలం సామెతలాగా, ఫైల్‌ చేయడం పూర్తయిపోయినా.. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి.  

యువకిశోరం అర్జున్‌ జూలైలో గడువు ముగిసేలోగానే ఫారంని క్లిక్‌ చేసి, సబ్మిట్‌ చేసేశాడు. కానీ, పాన్, ఆధార్‌ కార్డుతో అనుసంధానం కాకపోవడం వల్ల ఫారం  V మీద సంతకం పెట్టి, బెంగళూరులో అధికారులకు పంపడం మాత్రం మరిచిపోయాడు. 30 రోజుల్లోపల ‘వేలిడేట్‌’ చేయకపోవడం వల్ల రిటర్ను చెల్లదు. డిఫెక్టివ్‌ రిటర్న్‌ అవుతుంది.

రిటర్న్‌ వేయటానికి ముందే పాన్, ఆధార్‌ లింక్‌ చేసుకోవాలి. లేదా కనీసం రిటర్న్‌ వేసిన వెంటనే లింక్‌ చేసి, ఓటీపీ ద్వారా రిటర్నులను ‘వేలిడేట్‌’ చేసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల జాప్యం అయితే, వెంటనే ఫారం  V.. అంటే ’అక్నాలెడ్జ్‌మెంట్‌’ను స్వయంగా సంతకం పెట్టి, ఆ కాగితాన్ని బెంగళూరుకు పంపాలి. 30లోపల వారికి అందాలి. ఫారం  Vలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా ‘వెరిఫికేషన్‌’ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి.

నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎల్రక్టానిక్‌గా వేలిడేట్‌ చేసుకోవచ్చు. బ్యాంకు అకౌంటుని ముందుగానే తెలియజేసి, తద్వారా కూడా వేలిడేట్‌ చేయొచ్చు. డీమ్యాట్‌ ద్వారా ఒక మార్గం. ఇక పాన్‌–ఆధార్‌ అనుసంధానం మంచి మార్గం. ఇవీ కాకుంటే ఫారం Vని సంతకం పెట్టి పోస్ట్‌ చేయడం మరో మార్గం.

వెరిఫై అయితేనే ప్రాసెసింగ్‌.. 
రిటర్ను వేసినప్పటి నుంచి ఘడియలు లెక్కపెడతారు కొందరు .. రిఫండు కోసం. రిఫండు ఇంకా రాలేదని వాపోతారు మరికొంత మంది. వెరిఫై అయిన తర్వాతే మొదలవుతుంది అసెస్‌మెంటు. అంతవరకూ ముట్టుకోరు.  

ఏవైనా తప్పులు దొర్లాయా.. 
గడువు తేదీ నాడు వేసేయాలన్న తొందరలో ఏవైనా తప్పులు దొర్లాయా? ఏదైనా ఆదాయం మరచిపోయారా? టీడీఎస్‌ తక్కువ జమ అయిందా.. ఆదాయ వర్గీకరణలో తప్పు జరిగిందా.. మీ యజమానికి లెక్కల్లో పొరపాట్లు ఏర్పడ్డాయా.. క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కల్లో తప్పులు దొరికాయా.. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఏర్పడితే గాభరాపడొద్దు. మీరు మీ రిటర్నులను రివైజ్‌ చేసుకోవచ్చు.

ఒక ఉదాహరణ.. ప్రాక్టికల్‌ కేసు. ఒక అసెస్సీ బ్యాంకులో జూలై 31నాడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ చలానాలను ఉదయం 10 గంటలకు బ్యాంకులో జమచేశారు. కానీ సాయంకాలం రికార్డులలో అప్‌డేట్‌ కాలేదు. అయితే అన్ని వివరాలను పొందుపరుస్తూ, చలాన్‌ చెల్లించినట్లు రిటర్న్‌ వేసేశారు. దీని వల్ల లేటు ఫీజు పడలేదు. ఆగస్టు 1నాడు రికార్డుల్లో అప్‌డేట్‌ అయిన తర్వాత రిటర్న్‌ రివైజ్‌ చేసి, దాఖలు చేశారు. ఎలాంటి అదనపు ఖర్చు లేదు. రివైజ్‌ చేయడం వల్ల పన్ను భారం పెరిగితే దాన్ని చెల్లించాలి. ఇందుకు గడువు తేది 2026 డిసెంబర్‌ 31.  

ఇక డిపార్టుమెంటు వారి వంతు. బంతి వారి చేతిలో ఉంది. వారు ప్రాసెసింగ్‌ మొదలుపెట్టి, ఆర్డర్లు పాస్‌ చేస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఆర్డరు/వర్తమానం.. పాత చట్టం ప్రకారం 143 (1).. కొత్త చట్టంలో 270 (1) కింద వస్తుంది. వారానికొకసారి మీరు పోర్టల్‌లో ఈ సమాచారం కోసం ఎదురుచూడండి. ముందుగా మీకు మెసేజ్‌ వస్తుంది. ఈ సమాచారంలో ప్రాసెసింగ్‌ పూర్తి అయ్యిందని, సమాచారం పంపుతామని ఉంటుంది. అలా అన్న వెంటనే పంపరు కానీ.. తొందరలోనే వస్తుంది.

ఇప్పుడేం చేయాలి.. 
మీరు వేసిన రిటర్నుల్లో ఆదాయం, పన్ను భారంలో ఎలాంటి తేడాలు లేకపోతే, మీరు వేసిన దానితో సమ్మతిస్తున్నట్లు చెప్తారు. పన్నుభారం కన్నా ఎక్కువ పన్ను చెల్లిస్తే మీకు రిఫండు ఇస్తారు. రిఫండు తగ్గొచ్చు, పెరగవచ్చు. అయితే ప్రతి మార్పుకి/తేడాకి వివరణ ఇస్తారు. ఆదాయంలో మార్పులు రావొచ్చు. లెక్కింపుల్లో తప్పులు రావొచ్చు. పన్ను భారం మారవచ్చు. చెల్లించిన పన్నుల ఎంట్రీలు పూర్తిగా ఉండకపోవచ్చు. ఆ మేరకు లెక్కలు మారవచ్చు.

ఏయే మార్పులు వచ్చాయో వాటిని గమనించండి. వాటిని విశ్లేషించండి. అవి తప్పనిపిస్తే వాటితో విభేదించండి. అయితే, ప్రతి దానికి, వివరణ, సంజాయిషీ ఉండాలి. రిఫండు వస్తే సంతోషం. లేదా కారణాలను విశ్లేషించండి. సరైన జవాబు ఇవ్వండి.  

దీనితో ఈ కథ ముగిసినట్లే. కథ కంచికి. మనం ఇంటికి. అంతటితో ఆ కథకు ముగింపు పలికి, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం గురించి ఆలోచిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement