ఆలయంలో తొక్కిసలాట: ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం! | Bihar Stampede Like Chaos at Singheshwarnath Temple, 5 Devotees Injured | Sakshi
Sakshi News home page

ఆలయంలో తొక్కిసలాట: ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం!

Aug 24 2026 11:54 AM | Updated on Aug 24 2026 12:03 PM

Bihar Stampede Like Chaos at Singheshwarnath Temple, 5 Devotees Injured

మధేపుర: బిహార్‌లోని మధేపుర జిల్లాలోని బాబా సింగేశ్వర్‌నాథ్ ఆలయంలో సోమవారం ప్రధాన ద్వారం తెరవగానే ఒక్కసారిగా తొక్కిసలాట  పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం జననాయక్ కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. శ్రావణ మాస సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆలయంలో రాత్రి 12:30 గంటలకు ప్రభుత్వ అధికారిక పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాత్రి ఒంటి గంటకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయ బయటి ప్రాంగణంలోని ప్రధాన ద్వారం పక్కనుంచి భక్తులను వరుస క్రమంలో లోపలికి అనుమతించారు. అయితే, భక్తుల రద్దీ తీవ్రం కావడంతో తెల్లవారుజామున 4:00 గంటలకు ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తెరవగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. సుమారు 15 నిమిషాల పాటు తీవ్ర గందరగోళం కొనసాగింది.

ఇనుప గ్రిల్స్‌ను ఢీకొని కిందపడిపోవడంతో ఒకరి తలకు తీవ్ర గాయం అయ్యింది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో సుమారు అర డజను మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. డజనుకుపైగా ఇతర భక్తులు స్వల్ప గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో సుపౌల్‌కు చెందిన సింటూ కుమార్, సహర్సా జలసీమాకు చెందిన రూనా దేవి, మధేపుర గ్వాల్‌పారాకు చెందిన సులేనా దేవి, మరో గుర్తుతెలియని మహిళా భక్తురాలు ఉన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల లఖీసరాయ్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఇది కూడా చదవండి: ‘సిల్క్యారా’లో మళ్లీ ప్రమాదం.. 2023ను గుర్తుకు తెస్తూ..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement