మాట నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్‌ | Vijay Keeps His Promise: Parandur Airport Project Put on Hold | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

Aug 24 2026 11:39 AM | Updated on Aug 24 2026 11:54 AM

Vijay Keeps His Promise: Parandur Airport Project Put on Hold

మేనిఫెస్టో పేరిట అడ్డగోలు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం.. కొందరికి అలవాటే!. ముఖ్యంగా ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు ప్రజలను అలా మోసం చేస్తు‍న్నవే. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాగా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ సి విజయ్‌.

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్‌ సోమవారం కీలక ప్రకటన చేశారు. పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం వెల్లడించారు. చెన్నై సమీపంలో ప్రతిపాదించిన ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు, స్థానికులకు అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.

‘‘పరందూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని విజయ్‌ తెలిపారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన మూడు ఉచిత సిలిండర్ల పథకం పొంగల్‌ నుంచి ‍ప్రారంభిస్తామని, అక్టోబర్‌ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(డీలక్స్‌ బస్సులకూ వర్తింపజేస్తూ) పథకం మొదలుపెడతామని.. అలాగే మిగతా మేనిఫెస్టో హామీలపైనా స్పష్టత ఇచ్చారు. 

రైతుల ఆందోళనకు అండగా..
చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం జిల్లాలోని పరందూర్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ వల్ల బహుళ పంటలు పండే వ్యవసాయ భూములు, నీటి వనరులు దెబ్బతింటాయని స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

టీవీకే అధినేతగా ఉన్నప్పటి నుంచే విజయ్‌ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. 2024 అక్టోబర్‌లో విక్రవాండి సభలోనే ఈ అంశంపై స్పందించిన ఆయన.. పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినా, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్మాణాలు చేపట్టకూడదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ప్రజల హామీని నెరవేరుస్తానని చెప్పిన విజయ్‌.. తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

డీఎంకే హయాంలోనే ప్రతిపాదన
పరందూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు 2025 ఏప్రిల్‌లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిత స్థలాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి.. నీటి వనరులు, సారవంతమైన భూములను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు.

విజయ్‌ ప్రకటనపై డీఎంకే కౌంటర్‌
అయితే విజయ్‌ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎంకే సీనియర్‌ నేత దురైమురుగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్ట్‌కు సంబంధించిన మా ఫైళ్లను బయటపెట్టేందుకు విజయ్‌కు అనుమతి ఇస్తున్నాం. వారం రోజుల్లో వాటిని బయటపెట్టకపోతే.. అసెంబ్లీలో ప్రివిలేజ్‌ మోషన్‌ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని అన్నారు.

ఎన్నికల ముందు పరందూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన విజయ్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ముందుకు తెస్తూ తీసుకున్న ఈ నిర్ణయం.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: మిడ్డిలో విజయ్‌ ఎమ్మెల్యే??.. కీర్తన రియాక్షన్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement