కొనాక్రీ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇక్కడి ఒక డంపింగ్ యార్డులోని భారీ చెత్త కుప్ప ఒక్కసారిగా కుప్పకూలి సమీపంలోని నివాసాలపై పడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాయిటర్స్ కథనం ప్రకారం.. కొనాక్రీలోని దార్ ఎస్ సలామ్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్‌ఫిల్‌లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త దిబ్బలు సమీపంలోని ఇళ్లపై విరిగిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు సమీపంలోని పలు నివాసాలు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయాయి.
సమాచారం అందుకున్న గినియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎన్‌జీయూసీహెచ) సిబ్బంది, స్థానికులు ఎక్స్‌కవేటర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ దుర్ఘటనలో తన ఐదుగురు పిల్లలను కోల్పోయినట్లు స్థానిక బాధితుడు సిరే డియాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డు కూలే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం, ముందస్తుగానే స్థానికులను ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పలువురు నివాసితులు అక్కడే ఉండిపోవడంతో ప్రాణనష్టం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి అమదౌ బార్ సందర్శించి బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ల్యాండ్‌ఫిల్‌ను శాశ్వతంగా మూసివేసి, వ్యర్థాలను నగర శివార్లకు తరలిస్తామని ప్రాదేశిక పరిపాలన శాఖ మంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలు, అపారమైన ఇనుప ఖనిజ సంపద ఉన్నప్పటికీ, గినియాలో మౌలిక సదుపాయాల కొరత, పేదరికం తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు తెలియజేస్తున్నాయి.


