దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్‌ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్‌పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్‌లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్‌ఈస్ట్‌లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్‌ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.
మక్కా కూటమిలోకి ఇరాన్?
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు.
అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్‌కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.
ట్రంప్ ప్రభావమేనా?
ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్‌ఈస్ట్‌లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు.
శత్రువుల మధ్య కొత్త స్నేహమా?
ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్‌కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.
యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్‌ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.
ఇరాన్ లెక్కలు ఏంటి?
ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.
అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్‌కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్‌ఈస్ట్‌లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం


