ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్‌కు గురిచేస్తున్నాయి.
బంగ్లాదేశ్ రంగ్‌పూర్‌లోని దాస్‌పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగింది?
మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.
గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)
గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..
ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.
అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.
హిందువుల భద్రతపై మళ్లీ చర్చ
ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్‌పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే..


