ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం గత ఏడాది మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ముష్కరులకు భారీగా నష్టం వాటిల్లింది. పలువురు అంతమయ్యారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మర్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం తీవ్రస్థాయిలో ధ్వంసమైంది.
ఈ కార్యాలయాన్ని జైషే మొహమ్మద్ పునర్నిర్మించుకుంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొత్త పాలరాయి, రంగులు హంగులతో పునరుద్ధరించారు. భారత సైన్యం దాడుల్లో దెబ్బతిన్న గోపురాలను పునర్నిర్మించారు. గోతులను పూడ్చేశారు. నిర్మాణాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మర్కజ్ సుభాన్ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం జైషే మొహమ్మద్‌కు ఏకంగా రూ.25 కోట్లు వాయిదాల రూపంలో అందజేసింది.
ఇందులో సుమారు రూ.11 కోట్లను ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మదర్సా అల్–సబీర్, జైషే మొహమ్మద్ కమాండర్లు ఉపయోగించే నివాస గృహాలతో సహా ప్రధాన సముదాయానికి ఆనుకుని ఉన్న దెబ్బతిన్న నిర్మాణాలను తొలగించి, ఆ స్థలంలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన 15 నెలల తర్వాత ఈ పునర్నిర్మాణం పూర్తయింది.
అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కజ్ సుభాన్ అల్లా హెడ్ క్వార్టర్‌ను జైషే మొహమ్మద్ తమ కార్యకర్తల నియామకం, శిక్షణ, సిద్ధాంతాల బోధన కోసం ఉపయోగిస్తోంది. ఈ 18 ఎకరాల ‘ఉస్మాన్–ఓ–అలీ క్యాంపస్’ ప్రాంగణంలో ఒక మసీదు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వాస్తవానికి జైషే మొహమ్మద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2002లో∙నిషేధించినప్పటికీ ఆ సంస్థ పాక్ నుంచే తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.


