పాకిస్థాన్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా పాకిస్థాన్‌లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ కొత్త ఆఫీసును ప్రారంభించడంతో పాటు గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యాలయం ఒక గేమ్ చేంజర్‌గా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.
పాకిస్థాన్‌లో సరికొత్త అధ్యాయం: గూగుల్ తొలి కార్యాలయం
పాకిస్థాన్‌లో గూగుల్ తన కార్యకలాపాలను విస్తరిస్తూ తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో గూగుల్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దేశంలో సాంకేతికత, డిజిటల్ రంగాలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగాలలో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని దేశ డిజిటల్ ఎకానమీ అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తోంది.
కార్యాలయం లోపల లుక్ ఎలా ఉంది?
ఈ సరికొత్త గూగుల్ ఆఫీస్ సాధారణ ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా కాకుండా, అత్యంత ఆధునిక శైలిలో రూపుదిద్దుకుంది. గూగుల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఓపెన్ వర్క్‌స్పేస్, టీమ్ కొలాబరేషన్ ఏరియాలు, హైటెక్ మీటింగ్ రూమ్‌లతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. లోపలి పూర్తి దృశ్యాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ఆధారంగా ఇది చాలా స్టైలిష్, ప్రీమియం టెక్ లుక్‌తో కనిపిస్తోంది.
యువత డిజిటల్ నైపుణ్యాలే లక్ష్యం
పాకిస్థాన్ వేగంగా డిజిటల్ పరివర్తన వైపు అడుగులు వేస్తోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో భాగంగా స్థానిక యువతకు కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. గూగుల్ స్థానిక కార్యాలయం ఈ దిశగా ప్రభుత్వానికి సహకారాన్ని అందించనుంది. కంపెనీ భాగస్వామ్యంతో యువతకు కొత్త కెరీర్ అవకాశాలు, ఆధునిక సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు విస్తృతం కానున్నాయి.
బలపడుతున్న గూగుల్.. పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యం
ఈ కార్యాలయ ఏర్పాటును పాక్ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. గూగుల్, పాకిస్థాన్ మధ్య బంధం మరింత బలపడటానికి ఇది పునాది వేస్తుందని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ నేరుగా రంగంలోకి దిగడంతో దేశంలో భారీ స్థాయి డిజిటల్ ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ బిజినెస్‌లకు ఊతం లభించడమే కాకుండా, ప్రభుత్వ ‘డిజిటల్ నేషన్ పాకిస్థాన్’ విజన్‌కు గొప్ప బలం చేకూరనుంది.
క్రోమ్‌బుక్ అసెంబ్లీ లైన్: ఎగుమతులపై గూగుల్ దృష్టి
గూగుల్ ప్రతినిధి విల్సన్ వైట్ పాకిస్థాన్‌లో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రధానికి వివరించారు. స్థానిక భాగస్వామ్యంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘క్రోమ్‌బుక్ అసెంబ్లీ లైన్’ ప్రాజెక్టును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో క్రోమ్‌బుక్ తయారీ మొదలైతే, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ల్యాప్‌టాప్‌లను పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని గూగుల్ అంచనా వేస్తోంది. ఇది పాకిస్థాన్‌లో హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత ఉత్తేజితం చేస్తుంది.
భారత్‌తో పోలిస్తే పాక్ కార్యాలయం ఎంత భిన్నం?
భారతదేశంలో గూగుల్ ప్రస్థానం ఎన్నో ఏళ్ల క్రితమే మొదలైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో భారీ క్యాంపస్‌లు, విస్తారమైన పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ డీ) కేంద్రాలతో భారత్ ప్రపంచ టెక్ హబ్‌గా నిలిచింది. దీనితో పోల్చితే పాకిస్థాన్‌లో గూగుల్ ఉనికి ఇప్పుడే ప్రారంభమైంది. అందువల్ల ఈ రెండు దేశాల కార్యకలాపాలను నేరుగా పోల్చలేం. భారత్‌లో కార్యకలాపాలు అత్యున్నత స్థాయిలో ఉండగా, పాకిస్థాన్‌లో ప్రస్తుతానికి స్థానిక భాగస్వామ్యాలు, ఏఐ శిక్షణ, క్రోమ్‌బుక్ అసెంబ్లీ వంటి ప్రాథమిక ప్రాజెక్టులపైనే ప్రధాన దృష్టి కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం


