హసీనాపై బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు | Bangladesh Minister Calls Hasina Terrorist Cites India Visit Hurdle | Sakshi
Sakshi News home page

హసీనాపై బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Oct 6 2026 9:00 AM | Updated on Oct 6 2026 9:00 AM

Bangladesh Minister Calls Hasina Terrorist Cites India Visit Hurdle

ఢాకా: మాజీ ప్రధాని షేక్‌ హసీనా కార్యకలాపాలే బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌ ప్రతిపాదిత భారత్‌ పర్యటనకు ప్రధాన సవాలుగా మారాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్‌ కబీర్‌ అన్నారు. హసీనా, ఆమె బృందం మరో దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢాకాలో జరిగిన ‘బే ఆఫ్‌ బెంగాల్‌ కన్వర్సేషన్‌’ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన హుమాయున్‌ కబీర్‌.. హసీనాను ‘ఉగ్రవాది’గా అభివర్ణించారు. ఆమె, ఆమె అనుచరులు భారత్‌లో ఉంటూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హసీనా వల్ల భారత్‌కు కూడా ప్రయోజనం లేదని, బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్లను భారత్‌ అర్థం చేసుకోవాలని అన్నారు.

హసీనా అనుకూల అవామీ లీగ్‌ నేతల ప్రత్యక్ష విలేకరుల సమావేశాన్ని భారత్‌ అడ్డుకోవడాన్ని కబీర్‌ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో పరస్పర వ్యవహారాల్లో ఇది సాధారణ విధానమేనని అన్నారు. హసీనా, ఆమె బృందం కార్యకలాపాలను నియంత్రిస్తే ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్య ఉండదని పేర్కొన్నారు. తారిఖ్‌ రహ్మాన్‌ భారత్‌ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినదేనని కబీర్‌ తెలిపారు. అయితే కొన్ని సవాళ్లు ఉన్నాయని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని చెప్పారు. హసీనా, ఆమె బృందం ఢిల్లీలో ఉండటం పర్యటనకు ప్రధాన సవాలుగా ఉందని పేర్కొన్నారు. అనుకూల పరిస్థితులు ఏర్పడ్దాక బంగ్లాదేశ్‌ ప్రధాని భారత్‌ పర్యటన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌ ఇప్పటికే తారిఖ్‌ రహ్మాన్‌ను రెండు వేర్వేరు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించింది. ఒకటి ద్వైపాక్షిక అధికారిక పర్యటన కోసం కాగా, మరొకటి న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యేందుకు ఇచ్చిన ఆహ్వానం. అయితే ఇప్పటివరకు రహ్మాన్‌ భారత్‌లో పర్యటించలేదు. 2026 ఫిబ్రవరిలో ఎన్నికల విజయానంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రహ్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరూ ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. 2024 ఆగస్టు 5న ఢాకాలో పరిస్థితులు మారడంతో హసీనా అకస్మాత్తుగా భారత్‌కు రావడం తమకు కూడా ఊహించని పరిణామమని భారత్‌ హైకమిషనర్‌ దినేశ్‌ త్రివేది ఇటీవల వ్యాఖ్యానించారు. అప్పటికి ఆమె బంగ్లాదేశ్‌ ప్రధానిగా కొనసాగుతుండటంతో పొరుగుదేశంగా భారత్‌లో ఆమెకు ఆశ్రయం పొందేందుకు అనుమతి లభించిదని వివరించారు. హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్‌ ప్రభుత్వ డిమాండ్‌పై న్యాయపరమైన పరిశీలన జరుగుతోందని తెలిపారు.

ఇదీ చదవండి: ‘దోమలుకండి.. బొద్దింకలు కాదు’.. పోస్టర్ల హల్‌చల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement