అతడి విషయంలో ఎక్కడో పెద్ద తప్పే జరిగింది! | There Was a Big Mistake in Flydubai Co-Pilot Case Oman Sources Say | Sakshi
Sakshi News home page

ప్లైదుబాయ్‌ ఘటన: అతడి విషయంలో ఎక్కడో పెద్ద తప్పే జరిగింది!

Oct 6 2026 9:25 AM | Updated on Oct 6 2026 9:29 AM

There Was a Big Mistake in Flydubai Co-Pilot Case Oman Sources Say

ఫ్లైదుబాయ్‌ ఘటనలో కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ విషయంలో ఒమన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. హమామీ వ్యవహారంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగి ఉండొచ్చని అక్కడి సీనియర్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతడి ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై గతంలోనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ సమాచారాన్ని సరైన రీతిలో పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించాయి.

హమామీపై గతంలో ఒమన్‌ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏవియేషన్‌ రంగంలో శిక్షణ పొందుతున్న సమయంలోనే అతడి ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘాలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని ఒమన్‌ అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రవాద, ఉగ్రవాద సంబంధిత కంటెంట్‌పై అతడికి ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన తర్వాత.. ఒమన్‌లో ఏవియేషన్‌ కెరీర్‌ను కొనసాగించకుండా అడ్డుకున్నామని వెల్లడించాయి.

హమామీ తండ్రి మా దేశస్థుడే. తల్లి మాత్రం సిరియన్‌. అయితే  అతడు జీవితంలో ఎక్కువ కాలం ఒమన్‌ వెలుపలే గడిపాడు. గతంలో ఒమన్‌లోని ఓ విమానయాన సంస్థలో కొంతకాలం ట్రైనీగా పనిచేసిన సమయంలో అతడి ఇంటర్నెట్‌ కార్యకలాపాలను అధికారులు గమనించారు. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన వెబ్‌సైట్లు, కంటెంట్‌పై అతడి ఆసక్తిని గుర్తించిన తర్వాత.. అతడిని ఏవియేషన్‌ రంగంలో కొనసాగనివ్వలేదు అని ఓ సీనియర్‌ అధికారి భారత్‌కు చెందిన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

అయినా పైలట్‌గా ఎలా?
ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒమన్‌లోనే హమామీపై భద్రతాపరమైన అనుమానాలు వ్యక్తమైనప్పుడు.. ఆ తర్వాత అతడు మరోచోట ఏవియేషన్‌ రంగంలో(రెండు సంస్థల్లో!) ఎలా కొనసాగాడు?. అతడిని నియమించే ముందు అతడి గత రికార్డులపై తనిఖీలు జరిగాయా? ఒమన్‌లో గుర్తించిన అంశాలు ఇతర దేశాలు లేదా సంబంధిత సంస్థలకు ఎందుకు తెలియలేదు? అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది.

ఈ వ్యవహారంపై ఒమన్‌ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘హమామీ విషయంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగింది’’ అని వ్యాఖ్యానించాయి. అతడిని కో-పైలట్‌గా నియమించే ముందు భద్రతా ధ్రువీకరణ కోసం ఒమన్‌ను ఎవరూ సంప్రదించలేదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అధికారికంగా సమాచారం కోరితే.. తమ వద్ద ఉన్న వివరాలన్నింటినీ సంబంధిత వర్గాలతో పంచుకునేవారమని ఆ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

ఇలాంటి నియామకాల సమయంలో విమానయాన విధివిధానాలను పాటించడంలో లోపం జరిగి ఉండొచ్చని అన్నారాయన. ఇందులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం లేదంటే ఉద్దేశపూర్వకంగా విషయాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అయినా ఇజ్రాయెల్‌ విమానంలో ఎలా?
హమామీ ఒమన్‌ జాతీయుడైతే.. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో కో-పైలట్‌గా ఎలా పనిచేశాడన్న అంశంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌–యూఏఈ మధ్య ఉన్న విమానయాన ఏర్పాట్ల ప్రకారం సంబంధిత విమానాల్లో యూఏఈ పౌరులు లేదంటే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్న దేశాల పౌరులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని ఒమన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేనందున.. హమామీకి మరో దేశ పౌరసత్వం కూడా ఉండి ఉండొచ్చని ఆ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.

దాడిపై దర్యాప్తు
సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేశాడు. ఈ ఘటనను యూఏఈ, ఇజ్రాయెల్‌ అధికారులు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం దర్యాప్తులో హమామీ గత రికార్డులు, అతడికి లభించిన భద్రతా అనుమతులు, ఫ్లైట్‌ సిబ్బందిగా నియామకానికి ముందు జరిగిన తనిఖీలు కీలకంగా మారాయి. ఒమన్‌లో గతంలోనే అనుమానాలు వ్యక్తమైన వ్యక్తి.. చివరకు ఇజ్రాయెల్‌ వెళ్లే విమానానికి కో-పైలట్‌గా ఎలా నియమితుడు అయ్యాడనే మిస్టరీ వీడాల్సి ఉంది. 

ఇదీ చదవండి: జర్మనీలో వేల ఏళ్ల కిందటే ఆ టెక్నాలజీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement