పరీక్షల్లో చీటింగ్‌.. ఆ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా | South Korea education minister resigns | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో చీటింగ్‌.. ఆ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా

Nov 22 2026 3:26 PM | Updated on Nov 22 2026 3:33 PM

South Korea education minister resigns

దక్షిణ కొరియాలో ప్రవేశ పరీక్షల సందర్భంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో పరీక్ష నిర్వహణకు ముందు చివరి నిమిషంలో తీసుకున్న చర్యలతో గందరగోళం నెలకొనడంపై విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ రాజీనామా చేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా చర్యలు చేపట్టినందుకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

దక్షిణ కొరియాలో ఏటా నిర్వహించే కళాశాల ప్రవేశ పరీక్షను 'సునెంగ్'గా పిలుస్తారు. దాదాపు 9 గంటల పాటు జరిగే ఈ పరీక్ష సుమారు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును, వారి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది గురువారం నిర్వహించిన పరీక్షలో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు చివరి నిమిషంలో అత్యవసర చర్యలు చేపట్టారు.

ఈ వివాదానికి వారం రోజుల ముందు జాతీయ పన్నుల అకౌంటెన్సీ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన హాన్ వోన్-సోక్ (34) మోసానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఏప్రిల్‌లో జరిగిన ఆ పరీక్షలో 160 ప్రశ్నలకు కేవలం ఒక్కదానికి మాత్రమే తప్పుగా సమాధానం ఇవ్వడంతో అతడి మార్కులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు హాన్ తన మోసాన్ని వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు.

మైక్రో కెమెరాతో పరీక్ష ప్రశ్నలను చిత్రీకరించి, వాటిని ఏఐకి పంపినట్లు తెలిపాడు. అనంతరం తన స్మార్ట్‌ఫోన్‌లో సమాధానాలను పరిశీలించి మోసానికి పాల్పడినట్లు వివరించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు సునెంగ్ పరీక్షకు కొద్ది రోజుల ముందు అత్యవసర నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

పరీక్ష జరిగిన గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య దేశవ్యాప్తంగా మూడు అత్యవసర హెచ్చరికలు పంపించారు. ఫోన్లు సైలెంట్‌లో ఉన్నప్పటికీ పెద్ద శబ్దంతో మోగాయి. డేటా రోమింగ్ ఉపయోగిస్తున్న పర్యాటకుల ఫోన్లకు కూడా ఈ హెచ్చరికలు అందాయి. అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నా, విమాన ప్రయాణ మోడ్‌లో ఉన్నా హెచ్చరికలు వినిపించలేదు. పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు జాతీయ విపత్తు హెచ్చరికల వ్యవస్థను దక్షిణ కొరియా ఉపయోగించడం ఇదే తొలిసారి.

అంతేకాకుండా విద్యార్థులు తమ చొక్కాలు, జాకెట్ల బటన్లను కప్పుకోవాలని అధికారులు సూచించారు. దుస్తుల్లో రహస్య కెమెరాలు అమర్చకుండా ఈ చర్య చేపట్టారు. విద్యార్థులు ధరించే కళ్లద్దాలను కూడా తనిఖీ చేశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన వారిలో 111 మంది వద్ద అనుమతి లేని స్మార్ట్ పరికరాలను గుర్తించినట్లు విద్యాశాఖ వెల్లడించింది.

ఈ నిబంధనలతో నిజాయతీగా పరీక్ష రాసే విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. తమ సాధారణ కళ్లద్దాలను స్మార్ట్ గ్లాసెస్‌గా పొరబడతారేమోనని ఓ విద్యార్థి భయపడినట్లు 'కొరియా టైమ్స్' వెల్లడించింది. మరో విద్యార్థి అనుమానాలు రాకుండా పరీక్షకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించి వెళ్లినట్లు యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది.

ముందస్తు సన్నద్ధతలో వైఫల్యంపై విమర్శలు రావడం సహజమేనని మంత్రి చోయ్ పేర్కొన్నారు. ‘‘బాధ్యత కలిగిన మంత్రిగా ముందుగానే సిద్ధం కాకపోవడంపై వచ్చే విమర్శల నుంచి నేను తప్పించుకోలేను. పరీక్ష ముగిసిన నేపథ్యంలో నా బాధ్యతను గుర్తించి రాజీనామా చేస్తున్నాను’’ అని ఆదివారం ఆయన వెల్లడించారు. అనంతరం అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఆయన రాజీనామాను ఆమోదించారు. ప్రస్తుత ప్రవేశ పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని అధ్యక్షుడు ఇప్పటికే పిలుపునిచ్చారు.

ఈ ఘటనతో దక్షిణ కొరియాలో పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో ఏఐ ఆధారిత మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి శాశ్వత చర్యలు చేపడుతుందన్నది కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement